మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టాలి : ఆర్. కృష్ణయ్య
దిశ, ముషీరాబాద్: మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తక్షణమే ప్రధాని మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని రాజ్యసభ సభ్యులు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ శెట్టి బలిజే సంఘం హాల్ లో పిఆర్‌కే ఈవెంట్స్ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. మహిళలకు చట్ట సభల్లో, రాజకీయ రిజర్వేషన్లు ప్రజాస్వామ్యాన్ని సమర్థించడమే అని, మహిళలు సమాజంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను చక్కగా పరిష్కరించగలగడం వల్ల సమాజంలో మహిళల పరిస్థితి ని మెరుగుపరచడంలో ఈ రేజర్వేషన్లు దోహద పడుతాయన్నారు. పార్లమెంటులో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి, మహిళా రిజర్వేషన్ బిల్లు ఎగువ, దిగువ సభలో ప్రవేశపెట్టబడిందని అయితే రాజ్యసభ ఆమోదించిందని, లోక్‌సభలో పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. దానిని లోక్ సభలో తిరిగి ప్రవేశపెట్టాలని కోరారు.
ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. సుస్థిరమైన రేపటి కోసం నేడు లింగ సమానత్వం అనే నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటారన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాలు లింగ సమానత్వం, సమానత్వం, మహిళా సాధికారతను సాధించడం లో సాధించిన పురోగతిని జరుపుకునే సందర్భాన్ని సూచిస్తాయన్నారు. అయితే విజయాలను విమర్శనాత్మకంగా ప్రతిబింబించేలా, లింగ సమానత్వం వైపు మరింత ఊపందుకోవడానికి కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నందగోపాల్, రాష్ట్ర యువజన సంఘం కన్వీనర్ కె. రాజ్ కుమార్, విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ రామకృష్ణ వేముల, బిసి మహిళా సంఘం నేతలు గంగాపురం పద్మ, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, కవాడిగూడ కార్పొరేటర్ రచన శ్రీ, సీత, శ్రీదేవి, వైఎంసీఏ ప్రెసిడెంట్ శ్రీనివాస్, సంఘ సేవకులు మినినియం బాబు, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందించి మహిళా ప్రముఖులను ఆర్. కృష్ణయ్య, ముఠా గోపాల్, వకుళాభరణం కృష్ణమోహన్ లు శాలువాలు, ఫూలమాలలతో ఘనంగా సత్కరించారు.