AIMIM : ఎంఐఎంలో మార్పులు జరిగేనా

నాంపల్లి నియోజకవర్గం మజ్లిస్‌కు కంచుకోటగా నిలుస్తూ వస్తుంది. ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వ్యూహరచనతో స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్న బీఆర్ఎస్ సహకారంతో వరుస విజయాలను కైవసం చేసుకుంటూ వస్తుంది.

Update: 2023-10-26 02:26 GMT

దిశ, కార్వాన్ : నాంపల్లి నియోజకవర్గం మజ్లిస్‌కు కంచుకోటగా నిలుస్తూ వస్తుంది. ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వ్యూహరచనతో స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్న బీఆర్ఎస్ సహకారంతో వరుస విజయాలను కైవసం చేసుకుంటూ వస్తుంది. నాంపల్లిలో తమకు అడ్డే లేదంటూ మాంజా సాయంతో పతంగి పై పైకి ఎగురుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలుపుతామంటూ ఇదివరకే అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. 2018 ఎన్నికల్లో జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్‌లో నిలబెట్టిన అభ్యర్థులు అతి స్వల్ప ఓట్లతో ఓటమిచవిచూశారు. కాగా 2023 ఎన్నికల్లో ఈ రెండు స్థానాలతో పాటు మరిన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపి తమ సత్తాను చాటేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇదిలా ఉండగా మారిన పరిస్థితుల ప్రభావంతో బీఆర్ఎస్‌‌తో ఉన్న స్నేహభావంతో మోడీకి బీ టీం గా ఉందని ముద్రపడిందని ప్రచారం కూడా విస్తృతంగా జరుగుతోంది.

నాంపల్లిలో పతంగి ఎగిరేనా?..

నాంపల్లిలో కాంగ్రెస్ బలపడుతున్నట్లుగా సంకేతాలు జోరుగా వినిపిస్తున్న నేపథ్యంలో, బోగస్ ఓట్ల ప్రభావం అధికం కావడం, ముస్లిం మైనార్టీల ఓట్ల శాతం ఎక్కువగా ఉండటం, ప్రస్తుత ఎమ్మెల్యే మొత్తం తన వ్యాపార సామ్రాజ విస్తరణపైనే నిమగ్నం కావడం, ప్రజలకు అందుబాటులో లేకపోవడం, నియోజకవర్గంలో అతి తక్కువ ధరలకే పాత భవనాలు కొనుగోలు చేసి బహుళ అంతస్తులు నిర్మాణాలు చేపట్టడం, ప్రతి డివిజన్‌లో పార్టీ కార్యకర్తలను ఏజెంట్లుగా నియమించుకొని తమ కార్యకలాపాలను చక్కబెట్టుకోవడం వంటివి మైనస్ అనే చర్చలు కూడా ప్రజల్లో జోరుగా వినిపిస్తున్నాయి. గడిచిన రెండు ఎన్నికల్లో అతి స్వల్ప మెజార్టీతో గట్టెక్కడం, పార్టీ అధ్యక్షుడికి మింగుడు పడడం లేదని, ఒవైసీ అభ్యర్థి మార్పు ఖాయమనే సర్వేలలో తేలింది.

చురుగ్గా పనిచేస్తున్న మరో కీలక నేత..

మాజీ మేయర్‌గా పనిచేసిన మాజిద్ హుస్సేన్‌కు ఈసారి టికెట్ ఇస్తారని ప్రచారం ఓవైపు, మరోవైపు తన సోదరి కుమారుడైన యాసీన్ అరఫత్‌కు ఇస్తారనే టాక్ ప్రజలలో వినిపిస్తుంది. రోజురోజుకు మజ్లిస్ పార్టీకి సంబంధించి వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో ఎలాగైనా ఈ దఫా నాంపల్లి సీటును దక్కించుకోవాలని ప్రత్యర్థులు ఉవ్విళ్లూరుతున్నారు. బీజేపీ అభ్యర్థి ఖరారు తర్వాతే నాంపల్లి ఎంఐఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అభ్యర్థుల ప్రకటనకు మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది. ఎంఐఎం ఈ దఫా ఎవరికి టికెట్ కన్ఫామ్ చేసిన పతంగికి తగులుకున్న దారం తెగుతుందా, తగులుకొని పైకి ఎగురుతుందా తెలియాలంటే మరో నెల రోజులు పాటు వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News