కొత్త రేషన్ కార్డులు ఎక్కడ...పెన్షన్ల పెంపు ఏమైంది
కొత్త రేషన్ కార్డులు ఎక్కడని, పెన్షన్ల పెంపు ఏమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని ప్రశ్నించారు.
దిశ, ముషీరాబాద్ : కొత్త రేషన్ కార్డులు ఎక్కడని, పెన్షన్ల పెంపు ఏమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇచ్చిన గ్యారంటీలు ఏమయ్యాయని ఆయన నిలదీశారు. హామీలన్నీ మరిచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి అదే సర్వరోగ నివారిణిగా కాంగ్రెస్ చెబుతుందని ఆయన మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కిషన్ రెడ్డి ఉదయం ముషీరాబాద్, సాయంత్రం అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గాలలో జీప్ యాత్ర నిర్వహించారు. అడిక్ మెట్ హనుమాన్ టెంపుల్ వద్ద ప్రారంభమైన యాత్ర నాగమయ్య కుంట, వీహెస్ టీ, ఆర్టీసీ కల్యాణ మండపం, రాంనగర్ ఎక్స్ రోడ్ మీదుగా లలిత నగర్, జెమినీ కాలనీ, బాకారం వరకు కొనసాగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జీపుయాత్రకు మహిళలు, యువత ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని అన్నారు. ప్రజలు కేసీఆర్ ను ఫాం హౌజ్ కే పరిమితం చేశారని అన్నారు. గత పదేళ్లలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు వందల ఎకరాలు, వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చారని, ఇంకా అవి అమలు చేయలేదన్నారు. హామీలు అమలు చేయకుండా ఓట్లు అడిగే హక్కు రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలకు ఓటు వేసినా వృథా అవుతుందని చెప్పారు. దేశానికి, ప్రజలకు ప్రధానిగా నరేంద్ర మోదీ రక్షగా నిలుస్తున్నారని అన్నారు. దేశ ప్రజలంతా మోదీ పాలనలో సంతోషంగా ఉన్నారన్నారు. మోదీ మూడేండ్ల నుంచి పేదలకు ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నారని, దాన్ని మరో ఐదేండ్లు పొడిగించారని చెప్పారు.
నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రకాలుగా ముందుకు వెళ్తుందని, 500 ఏళ్ల తర్వాత రాముడి గుడి కట్టుకున్నామని అన్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి మొదటిసారి మోదీ ప్రధాని అయ్యారని, అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి దేశం కోసం సమాజం కోసం పని చేస్తున్నారని, మరోసారి మోదీని ప్రధానిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సికింద్రాబాద్ నుంచి తనను ఎంపీగా ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే అంబర్ పేట నియోజకవర్గంలో సాయంత్రం బాపునగర్ కాకతీయలేని నుంచి ప్రారంభమైన జీప్ యాత్ర బాపునగర్ హనుమాన్ టెంపుల్, చిన్నారెడ్డి నగర్, ఎన్ వీ ఆర్ ఫంక్షన్ హాల్, నరేంద్ర నగర్ ఎక్స్ రోడ్, రెడ్డి హోటల్, మైసయ్య హోటల్ లేన్, భగవాన్ దాస్ హౌస్ మీదుగా హనుమాన్ కమాన్, అలీ కేఫ్ ఎక్స్ రోడ్ వరకు సాగింది.