ఫుడ్ సేఫ్టీ అధికారుల జాడేది…?

హైదరాబాద్ కు ఉన్న బ్రాండ్ ను కాపాడేందుకు ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ విభాగంలో అధికారుల సంఖ్య ఫిర్యాదుల విషయంలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తుంది.

Update: 2024-11-16 15:37 GMT

దిశ, కార్వాన్ : హైదరాబాద్ కు ఉన్న బ్రాండ్ ను కాపాడేందుకు ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ విభాగంలో అధికారుల సంఖ్య ఫిర్యాదుల విషయంలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తుంది. మరోవైపు స్ట్రీట్ ఫుడ్ వండర్స్ కు ఎఫ్ ఎస్ ఏ ఐ సర్టిఫికెట్లు, లైసెన్స్ ,రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లతో పాటు మొబైల్ టెస్టింగ్ ఫుడ్ ల్యాబ్ లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుపుతున్న విషయం విధితమే. కాగా నాంపల్లి కార్వాన్ నియోజకవర్గాల్లో కొన్ని హోటల్స్ లో యజమానులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. హైదరాబాదులోని పలు హోటల్స్, బేకరీస్, రెస్టారెంట్లలో పరిశుభ్రత లోపించింది. తినుబండారాలలో విష పురుగులు ప్రత్యక్షమైన దృశ్యాలు వెలుగు చూస్తున్నాయి.

ఇదిలా ఉండగా హోటల్స్ యజమానులు నిల్వ ఉంచిన పదార్థాలను భోజన ప్రియులకు అందిస్తున్నారు. తనిఖీలు చేయాల్సిన అధికారుల జాడే కనిపించడం లేదు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రమే అధికారులు ప్రత్యక్షమై ఫుడ్ శాంపిల్స్ ని సేకరించి హడావిడి చేసి నోటీసులు జారీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరుసటి రోజు వాటిని పట్టించుకోకపోవడం షరా మామూలు అయ్యింది. హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతుంటే నాంపల్లి కార్వాన్ నియోజకవర్గాల్లో మాత్రం అధికారులు చలనం లేకుండా ఉన్నారని అపవాది మూట కట్టుకున్నారు.

హోటల్స్ లో అపరిశుభ్రత క్వాలిటీ లేని ఫుడ్..

భోజన ప్రియులకు గుర్తొచ్చే ప్రాంతం ఏదైనా ఉందంటే అది హైదరాబాద్..హైదరాబాద్ అంటేనే బ్రాండ్.. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కాకుండా ఇతర రాష్ట్రాలు విదేశీయులు సైతం భోజనం కోసం హైదరాబాద్ వైపే మక్కువ చూపిస్తారు.హైదరాబాదులో ప్రతి గల్లీకి రెండు మూడు కు పైగా హోటల్స్ దర్శనం ఇస్తాయి. కాగా కొన్ని హోటల్స్ లో సరైన నాణ్యతలేని ఫుడ్ను హోటల్ యజమానులు కస్టమర్లకు అందిస్తున్నారు. ఇది ఆరగించిన కస్టమర్లు రోగాల బారిన పడాల్సిందే. మరోవైపు హోటల్స్ బేకరీస్ రెస్టారెంట్లలో పరిశుభ్రత లోపించింది. కిచెన్లు వాష్ రూమ్లలో పరిశుభ్రత లోపించి దుర్గంధంతో దోమలు బ్యాక్టీరియా స్వైర విహారం చేస్తున్నాయి.

శుక్రవారం ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో నూడిల్స్ లో బొద్దింక ప్రత్యక్షమైనట్లు ఫోటో సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టింది. దీంతో జనాలు రోగాల బారిన పడాల్సిందేనని పలువురు ఆరోపిస్తున్నారు. రెస్టారెంట్లలో కొన్ని రోజులుగా నిలువ ఉంచిన ఫుడ్ ను అందిస్తున్నారని ఆరోపణలు జోరందుకున్నాయి. ఇది ఇలా ఉండగా యాజమాన్యం మాత్రం ధనార్జన ధ్యేయంగా వ్యాపారం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు నుండి విమర్శలు వినిపిస్తున్నాయి.

ఫుడ్ సేఫ్టీ అధికారుల జాడేది...

నాంపల్లి కార్వాన్ నియోజకవర్గంలో ఒక్కో నియోజకవర్గంలో వందల సంఖ్యలో హోటల్స్ బేకరీస్ రెస్టారెంట్లు ఉన్నాయని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు చేస్తుంటే. ఈ నియోజకవర్గాల్లో అందుకు విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తనిఖీలు చేపట్టాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు కార్యాలయానికి పరిమితం అవుతున్నారని ఆరోపణలు జోరందుకున్నాయి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రమే అధికారులు ప్రత్యక్షమై నామమాత్రపు తనిఖీలు నిర్వహించి శాంపుల్స్ ను సేకరించి హడావిడి చేస్తున్నారనే అపవాది మూటగట్టుకున్నారు. మరుసటి రోజు అటువైపు కన్నెత్తి చూడకుండా ఉండడం షర మాములే అయిపోయింది. ఒక్కొక్క అధికారికి రెండు సర్కిల్లలో బాధ్యతలు అప్పగించడంతో తనిఖీలు శూన్యం గా కనిపిస్తున్నాయి. ఇదే అదను చూసుకుని కొన్ని హోటల్స్ యజమానులు ధనార్జనే ధ్యేయంగా వ్యాపారం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఫుడ్ లవర్స్ కోరుతున్నారు.


Similar News