పోలీసులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించం : ఏసీపీ విష్ణుమూర్తి
హీరో అల్లు అర్జున్ వ్యవహారం పుష్ప -2 సినిమా విడుదల, తదనంతర పరిణామాలపై ఏసీపీ విష్ణుమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, ఖైరతాబాద్ : హీరో అల్లు అర్జున్ వ్యవహారం పుష్ప -2 సినిమా విడుదల, తదనంతర పరిణామాలపై ఏసీపీ విష్ణుమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ఓ రిమాండ్ ఖైదీ.. కేసు విచారణ కోర్టులో ఉండగా ముద్దాయి ప్రెస్ మీట్ పెట్టొచ్చా అని ప్రశ్నించారు. సంధ్య థియేటర్ దగ్గర గ్యాదరింగ్ వద్దని పోలీసులు చెప్పిన అల్లు అర్జున్ వినలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ బాధ్యత గల పౌరుడిగా ప్రవర్తించలేదని విమర్శించారు.
సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ బౌన్సర్ల తోపులాటతోనే మహిళా చనిపోయిందని ఆరోపించారు. బౌన్సర్లతో దౌర్జన్యం కరెక్ట్ కాదని.. పబ్లిక్ ప్లేస్ లో సెలెబ్రెటీలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పోలీసులు తమ డ్యూటీలు సరిగ్గానే నిర్వహించారని.. పోలీసులంటే కనీస గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోలీసులను అవమానపరచడం సరి కాదని హితవు పలికారు. పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని.. అధికారులను ఇష్టం వచ్చినట్లు తిడితే రీల్స్ కట్ చేస్తామని ఘాటు వార్నింగ్ ఇచ్చారు.చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి పోలీసులపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు.
సినిమాల్లో కూడా పోలీసులను అమానించడం మానుకోవాలని..వాపును చూసి బలమని మురిసిపోవద్దని అన్నారు. ఇష్టానుసారం ప్రవర్తిస్తే చట్ట ప్రకారం ముందుకు వెళ్తాం అన్నారు. దొంగతనాలపై సినిమా తీసి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. దొంగలు, రౌడీలు, స్మగ్లర్లలా కాకుండా.. సందేశాత్మక సినిమాలు తీస్తే ప్రోత్సాహిస్తామని అన్నారు. సినిమా వాళ్లు వాపును చూసి బలం అనుకుంటున్నారు. మీ వాపును ప్రజలే తీసి పడేస్తారు. ఇంకోసారి పోలీసులను ఎవరైనా అవమానించే విధంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని అన్నారు. చట్టపరంగా, న్యాయపరంగా ముందుకెళ్తాం.. ప్రజల్లోకి తీసుకెళ్లి మరీ వాళ్ల బట్టలూడదీస్తాం అని మండిపడ్డారు.