అక్రమాలకు కేరాఫ్ గా వెటర్నరీ.. ఏళ్లుగా కాంట్రాక్టర్లు వారే..!

జీహెచ్ఎంసీలోని వెటర్నరీ విభాగం మొత్తం అక్రమాల పుట్టగా మారుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Update: 2023-05-15 03:42 GMT

దిశ, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీలోని వెటర్నరీ విభాగం మొత్తం అక్రమాల పుట్టగా మారుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహానగరంలో విపరీతంగా పెరిగిన కుక్కల బెడదతో నగరవాసులు బేజారవుతుంటే, కుక్కల నియంత్రణ పేరిట అధికారులు, ఏళ్లుగా తిష్టవేసిన కాంట్రాక్టర్లు జీహెచ్ఎంసీకి చెందిన కోట్లాది రూపాయలను జేబులు నింపుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. కొద్ది రోజుల క్రితం అంబర్‌పేటలో నాలుగేళ్ల చిన్నారి కుక్కల దాడిలో చనిపోతే, కుక్కల నియంత్రణ, స్టెరిలైజేషన్ అంటూ జీహెచ్ఎంసీ అధికారులు చేసిన హడావుడి కేవలం కొద్ది రోజులకే పరిమితమైందని తేలిపోయింది.

ఇందుకు ఇటీవలే మౌలాలీలో ఓ విద్యార్థినిపై కుక్కల గుంపు మూకుమ్మడిగా దాడి చేయటంతో స్థానికులు జోక్యం చేసుకుని కుక్కలను తరిమేయటంతో ఆ విద్యార్థికి ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేసి వారం గడుస్తున్నా, నేటికీ వెటర్నీ విభాగం అధికారులు కనీసం ఘటన స్థలానికి వచ్చి కుక్కలు పట్టుకెళ్లిన దాఖలాల్లేవు. కుక్కలు గుంపులుగా సంచరిస్తున్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయికెళ్లి కుక్కలను పట్టుకెళ్లి, వాటికి వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేసి తిరిగి అక్కడికే తెచ్చి వదలాల్సిన బాధ్యత వెటర్నరీ విభాగంపైనే ఉంది. కానీ వెటర్నరీ విభాగంలోనున్న వందలాది మంది సిబ్బంది, పదుల సంఖ్యలోనున్న వాహనాలు సరిపోకవటంతో జోన్‌కు ఒకరు చొప్పున ఆరుగురు కాంట్రాక్టర్లను జీహెచ్ఎంసీ నియమించుకుంది.

వీరు ప్రత్యేకంగా ఆరు బొలారో వాహనాలను కూడా వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. కానీ ఈ కాంట్రాక్టర్లు ఏనాడు విధులు నిర్వర్తించిన దాఖలాల్లేవని వెటర్నరీ విభాగం సిబ్బందే బహాటంగా చెబుతున్నారు. అవినీతి అధికారులకు అంబర్‌పేట ఘటన సువర్ణావకాశంగా మారిందన్న వాదనలున్నాయి. అప్పటి వరకు లక్షల్లో ఉన్న వెటర్నరీ అధికారుల అక్రమార్జన ఇప్పుడు కోట్లకు పెరిగిందన్న ఆరోపణలున్నాయి. రోజు చేసే స్టెరిలైజేషన్ ఆపరేషన్లు, వ్యాక్సినేషన్ల సంఖ్యను పెంచాలని, అదనపు సిబ్బంది, వాహనాలను సమకూర్చుకోవాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలు వీరి అక్రమ సంపాదనకు అవకాశంగా మారాయని చెప్పవచ్చు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీరు వెటర్నరీ విభాగాన్ని పటిష్టపరిచి ఉంటే మౌలాలీలో ఫిర్యాదు చేసి వారమైనా ఎందుకు స్పందించలేదో సమాధానం చెప్పాలని ఫిర్యాదుదారులు ప్రశ్నిస్తున్నారు.

మిలాఖత్..

ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఔట్ సోర్స్‌గా నియమించిన సిబ్బంది కాకుండా ఆరుగురు కాంట్రాక్టర్లు వేరుగా కుక్కల నియంత్రణ విధులు చేపట్టాల్సి ఉంది. కానీ వీరిలో నలుగురు కాంట్రాక్టర్లు అధికారుల బినామీలని తెలిసింది. వీటిలో శేరిలింగంపల్లి సర్కిల్‌లో విధులు నిర్వర్తించే ఓ వెటర్నరీ ఆఫీసర్ కాంట్రాక్టర్లతో మిలాఖత్ అయి వారు పని చేయకపోయినా, వారు వినియోగించాల్సిన బొలారో వాహనాన్ని ఆఫీసు ఆవరణలో పార్కింగ్ చేయించి, ఒక్కో వాహనానికి నెలకు సుమారు రూ.1.80 లక్షలు బిల్లులు క్లెయిమ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఏటా టెండర్ల ప్రక్రియ చేపట్టి, కాంట్రాక్టర్లను మార్చాల్సిన వెటర్నరీ విభాగం అధికారులు, వారిపైనున్న ఉన్నతాధికారులు ఈ విషయంలో మౌనం వహించటం కుక్కల పేరిట భారీ అవినీతి జరుగుతుందనేందుకు బలాన్ని చేకూరుస్తుంది.

దారి మళ్లుతున్న మందులు..

నగరంలోని ఆయా ప్రాంతాల నుంచి పట్టుకొచ్చిన కుక్కలకు వేయాల్సిన వ్యాక్సిన్లు, వాటికి స్టెరిలైజేషన్ చేసేందుకు వినియోగించే మందులు, ఆపరేషన్ తర్వాత ఇవ్వాల్సిన మందులు, ఆహారాన్ని కూడా వెటర్నరీ ఆఫీసర్ల రింగ్ మింగేస్తున్నట్లు సమాచారం. శేరిలింగంపల్లిలోని ఓ వెటర్నరీ ఆఫీసర్ నెలకు కొన్ని లక్షల రూపాయల విలువ చేసే ఈ మందులను దారి మళ్లిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రతి నెల ఆరు జోన్లలో సుమారు కోట్ల రూపాయల మందులను బయట అమ్ముకుంటున్నట్లు సమాచారం.

ఇందులో ప్రధాన కార్యాలయంలోని పలువురు ఉన్నతాధికారులకు కూడా వాటాలుండటంతో ఎవరు నోరు విప్పటం లేదని సమాచారం. చివరకు కుక్కలకు పెట్టే సన్న బియ్యాన్ని కూడా అమ్ముకుంటూ, వాటికి రేషన్ బియ్యం వండి పెడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇదే ఆరోపణపై కొద్ది నెలల క్రితం శేరిలింగంపల్లి సర్కిల్ పై ఈవీడీఎం తనిఖీలు నిర్వహించగా, రేషన్ బియ్యం బయటపడ్డాయి. వీటిని స్వాధీనం చేసుకున్న ఈవీడీఎం అధికారులు నేటికీ సదరు వెటర్నరీ ఆఫీసర్ పై చర్యలేమీ తీసుకోకపోవటంతో వీరిద్దరి మధ్య బేరం కుదిరిందన్న ఆరోపణలు సైతం ఉన్నాయి.

Tags:    

Similar News