దారిదోపిడికి పాల్పడిన ఇద్దరు నిందితులు అరెస్ట్

ఫుడ్ డెలివరీ బాయ్ ను బెదిరించి దోపిడీకి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు మియాపూర్ పోలీసులు.

Update: 2025-03-21 16:13 GMT
దారిదోపిడికి పాల్పడిన ఇద్దరు నిందితులు అరెస్ట్
  • whatsapp icon

దిశ, శేరిలింగంపల్లి : ఫుడ్ డెలివరీ బాయ్ ను బెదిరించి దోపిడీకి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు మియాపూర్ పోలీసులు. ఇందుకు సంబంధించి మియాపూర్ డీఐ రమేష్ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. హఫీజ్ పేట్ కు చెందిన ఎండీ జావేద్ ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే ఈనెల 7వ తేదీన తన హోండా షైన్ ( టీఎస్ 11 ఈఈ 1382) పైన ఫుడ్ డెలివరీల కోసం వెళ్ళాడు. గోకుల్ ప్లాట్స్ లోని ఓ హోటల్ నుంచి డెలివరీ తీసుకుని కొంచెం ముందుకు వచ్చి యూటర్న్ తీసుకుంటుండగా, ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అతని బైక్‌ను స్కూటీతో అడ్డుకుని, గంజాయి డెలివరీ చేస్తున్నావని అతనిపై దాడికి దిగారు. ఒకరు అతని హెల్మెట్‌తో కొట్టగా, మరొకరు అతని బైక్‌ లాక్కున్నాడు. అనంతరం జావేద్ ను ఒక కూరగాయల దుకాణం వద్దకు తీసుకువెళ్లి అతన్ని కొట్టి రూ.5000, రెండు మొబైల్ ఫోన్‌లను దోచుకున్నారు.

సంఘటన గురించి చెబితే చంపేస్తామని బెదిరించి, అతని ఫోన్‌పే పాస్‌వర్డ్, బైక్ కీని కూడా తీసుకున్నారు. బాధితుడు ఎండీ జావేద్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన మియాపూర్ పోలీసులు దారి దోపిడీకి పాల్పడిన నిందితులు కూకట్ పల్లికి చెందినాబ్ బర్నోటి ఆగమయ్య (19) జగద్గిరిగుట్టకు చెందిన బసోడి అభిషేక్ (25 )లను అదుపులోకి తీసుకున్నారు. ఫుడ్ డెలివరీ బాయ్ జావేద్ పై దాడి చేసి దోపిడీకి పాల్పడింది తామేనని నిందితులు అంగీకరించారు. నిందితుల వద్ద నుంచి 10 మొబైల్ ఫోన్లు, బంగారు ఉంగరం, ఇయర్ బడ్స్, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేయడంలో కీలకంగా వ్యవహరించిన మియాపూర్ సీఐ క్రాంతికుమార్, డీఐ రమేష్ నాయుడు, సిబ్బందిని మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ అభినందించారు.


Similar News