Osmania University : ఓయూలో ధర్నాకు దిగిన విద్యార్థినిలు
ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University)లో మరోసారి విద్యార్థినిలు ధర్నా(Strike)కు దిగారు.

దిశ, వెబ్ డెస్క్ : ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University)లో మరోసారి విద్యార్థినిలు ధర్నా(Strike)కు దిగారు. ఓయూలోని సెంటీనరీ లేడీస్ హాస్టల్లో నీళ్ళు రావడం(Water Problem) లేదని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. గత మూడురోజుల నుంచి నీళ్ళు రాక ఇబ్బందిగా ఉందని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యార్థినిలు వాపోయారు. వేసవి కావడంతో స్నానం చేయడానికి, కనీసం మొహం కడుక్కోవడానికి కూడా నీళ్ళు లేవని అన్నారు. అధికారులు పట్టించుకోక పోవడం వల్లే నిరసనకు దిగాల్సి వచ్చిందని, తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. కాగా వీరికి పలు విద్యార్థి సంఘాలు తోడవ్వడంతో కొద్దిసేపు.. నినాదాలతో హోరెత్తించారు. సమాచారం అందుకున్న హాస్టల్ డైరెక్టర్, సూపరింటెండెంట్ అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. ఆందోళన విరమించాలని.. రేపు ఉదయం లోగా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాగా ఓయూలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఓయూ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.