మధ్యాహ్నం బయట తిరగకపోవడమే మంచిది.. హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్
అత్యవసరమైతే బయటకు రావాలని, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బయట తిరగొద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది.
దిశ, తెలంగాణ బ్యూరో: అత్యవసరమైతే బయటకు రావాలని, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బయట తిరగొద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల ద్రుష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశారు. దాహంగా లేకపోయిన తగినంత నీళ్లు తాగాలని, ఇంట్లో తయారు చేసిన లెమన్ వాటర్, మజ్జిగ, పళ్ల రసాలు సేవించాలని, బయటకు వెళ్లేటప్పుడు వాటర్ వెంట తీసుకువెళ్లాలని తెలిపారు.
సీజనల్ పళ్లను, కూరగాయలను ముఖ్యంగా నీటి శాతం ఎక్కువగా ఉండే వాటర్ మిలన్, మస్క్ మిలన్, సంత్రాలు, గ్రేప్స్, ఫైనాపిల్, కీరదోస వంటివి ఎక్కువ తీసుకోవాలని పేర్కొన్నారు. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, క్యాప్, టవల్ వంటివి తలకు ఎండ తగలకుండా చుట్టుకోవాలని, అలాగే ఎండ వేడిని తట్టుకునేలా లేత రంగు కాటన్ దుస్తులనే ధరించాలని తెలిపారు. బయటకు వెళ్లేటప్పుడు షూస్, చెప్పులు తప్పకుండా ధరించాలన్నారు. అవసరమైతేనే బయటకు రావాలని, ఇంట్లో ఉన్నప్పుడు పగటి వేళ డోర్లు కిటికీలు తెరిచిఉంచొద్దని, ఎండ లేని టైంలో వెంటిలేషన్ తెరిచిపెట్టుకోవాలని తెలిపారు. ముఖ్యంగా వంటగదిలో వెంటిలేషన్ ధారాళంగా ఉండేలా చూసుకోవాలని పేర్కొంది. బయటకెళ్లే పనులు ఉదయం, సాయంత్రం పూట మాత్రమే పెట్టుకోవాలని సూచించారు.
అప్రమత్తంగా ఉండాలి..
మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు బయట రాకూడదని, ఆల్కహాల్, టీ, కాఫీ, సాఫ్ట్ డ్రింక్స్, షుగర్ ఎక్కువ ఉండే పదార్థాలతో పాటు, హై ప్రోటీన్, మసాలా, నూనె పదార్థాలు తినకూడదని తెలిపారు. వాంతులు, చర్మం ఎర్రగా మారడం, తలనొప్పి, గుండె దడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే వెంటనే దగ్గరలోని వైద్యులను సంప్రదించాలని సూచించారు. వాతావరణ సమాచారం కోసం పేపర్ , టీవీ, రేడియోలలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలని, లేదా ఐఎండీ వెబ్సైట్ ను సంప్రదించాలన్నారు.