సలహాలు ఇస్తున్నామంటూనే ఒత్తిడికి గురి చేస్తున్నారు.. విద్యార్థిని తల్లి ఆరోపన

విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు బాసటగా నిలుస్తున్న విదేశీ ఉద్యోగ కల్పన సంస్థ(టామ్ కామ్) విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది.

Update: 2025-04-10 02:29 GMT
సలహాలు ఇస్తున్నామంటూనే ఒత్తిడికి గురి చేస్తున్నారు.. విద్యార్థిని తల్లి ఆరోపన
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు బాసటగా నిలుస్తున్న విదేశీ ఉద్యోగ కల్పన సంస్థ(టామ్ కామ్) విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. విదేశాలకు ఉపాధి కోసం వెళ్లే వారికి బాసటగా నిలుస్తున్న టామ్ కామ్, అభ్యర్థులకు సరైన అవగాహన కల్పించడంలో విఫలమవుతోంది. కోవిడ్ తర్వాత హెల్త్ కేర్ రంగంలో మంచి ప్యాకేజీలతో విదేశీ సంస్థలు ముందుకు వస్తున్న తరుణంలో టామ్ కామ్‌లో కొందరు అధికారులు గందరగోళ పరిస్థితులను సృష్టిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. భాషా నైపుణ్యం సంపాదించాకే విదేశాలకు వెళ్లాలనే నిబంధనతో పాటు కొన్ని పరీక్షలు పాసవ్వాల్సి ఉంటుంది. అందులో మాడ్యూల్స్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తాయి. అయితే ఇలాంటి విషయాలపై టామ్ కామ్ తల్లిదండ్రులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించడంలో విఫలమవుతుందనే వాదన వినిపిస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులు, టామ్ కామ్ అధికారులకు మధ్య పేరేంట్స్ మీటింగ్స్ నిర్వహించినా కొన్ని విషయాల్లో స్పష్టత రావడం లేదు.

పేరెంట్స్ వాదన

విదేశాల్లో ఉపాధి పొందాలనుకునే వారికి ప్రభుత్వ రంగ సంస్థ టామ్ కామ్ నకిలీ వీసాలతో, తప్పుడు పద్ధతుల ద్వారా వెళ్లి అక్కడ ఇబ్బందులకు గురికావద్దనే ఉద్దేశంతో అభ్యర్థులు అన్ని రకాల శిక్షణలను పూర్తి చేసుకున్న తర్వాతే పంపుతుంది. ఇటీవల కాలంలో జర్మనీలో ప్రఖ్యాత హాస్పిటల్స్ లో నర్సు ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థుల తల్లిదండ్రుల్లో గందరగోళం నెలకొంది. జర్మనీలో జాబ్ చేయాలనుకుని శిక్షణ తీసుకుంటున్న ఒక నర్సింగ్ విద్యార్థిని కోర్సుకు సంబంధించి ఫీజుల చెల్లింపుల విషయంలో టామ్ కామ్ అధికారులు స్పష్టత ఇవ్వడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. అంతేకాకుండా పరీక్షలకు సంబంధించి నాలుగు మాడ్యుల్స్ ఉంటే రెండు మాడ్యుల్స్ కి టామ్ కామ్ స్లాట్ బుక్ చేస్తోందని, మిగతా రెండింటికి తమను స్లాట్ బుక్ చేసుకోవాలని తర్వాత అమౌంట్ రీఫండ్ చేస్తామని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సలహాలు ఇస్తున్నామంటూనే అండర్ టేకింగ్ విషయంలో ఒత్తిడికి గురి చేస్తున్నారని ఒక నర్సింగ్ విద్యార్థిని తల్లి ఆరోపించింది.

రూల్స్ ప్రకారమే ట్రైనింగ్ ప్రాసెస్: సౌదామిని, టామ్ కామ్ ఇంచార్జీ

విదేశాలకు వెళ్లే యువతకు హిందీ, ఇంగ్లీష్‌‌తో పాటు ఆయా దేశాల భాషలపై అవగాహన కల్పించడానికి టామ్ కామ్ శిక్షణ అందిస్తోంది. కొన్ని సందర్భాల్లో అభ్యర్థులు స్వయంగా భాషా శిక్షణ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూలు, అవసరమైన నైపుణ్యాలను పరీక్షిస్తారు. మొత్తం 4 మాడ్యూల్స్ పరీక్షలకు హాజరయ్యే సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురవుతుంటారు. తద్వారా ఆ ప్రభావం విద్యార్థులపై పడకుండా రెండు మాడ్యూల్ పరీక్షలను రాసేలా అవగాహన కల్పిస్తాం. ఒక్కోసారి బాగా చదివే పిల్లలు కూడా విదేశీ భాషలు నేర్చుకోవడంలో కొంత వెనకబడుతుంటారు. విదేశాల్లో భాషాపరమైన ఇబ్బందులు రాకుండా ట్రైనర్స్ డిక్లరేషన్ తప్పకుండా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలాంటప్పుడు విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు.

Tags:    

Similar News