నేడే అసెంబ్లీలో కీలక తీర్మానం.. ప్రవేశపెట్టనున్న CM రేవంత్
డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా నేడు అసెంబ్లీలో తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా నేడు అసెంబ్లీలో తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై వివిధ రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు తెలపనున్నాయి. బీజేపీ మినహా మిగిలిన పక్షాలన్నీ డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు పెరిగే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో సీట్లు పెంచుకుని మళ్లీ అధికారంలోకి రావాలని కమలం పార్టీ ప్రయత్నిస్తున్నదని వివిధ రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గేలా చేసి ఇక్కడి రాష్ట్రాలను నామమాత్రం చేయాలని మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని, కాంగ్రెస్‌సహా ప్రాంతీయ పార్టీలన్నీ అభిప్రాయపడుతున్నాయి.
చెన్నయ్‌లో అఖిలపక్ష సమావేశం
డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా శనివారం చెన్నయ్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. దీనికి కేంద్రంలోని బీజేపీ భాగస్వామ్య పక్షాలు, వైఎస్‌ఆర్‌సీపీ ప్రతినిధులు అటెండ్ కాలేదు. ఇందులో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. తాము డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించారు. త్వరలోనే హైదరాబాద్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని, ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు భారీ బహిరంగ సభ సైతం ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు.
25 ఏండ్ల పాటు వాయిదా వేయాలని సూచన
లోక్‌సభ స్థానాల పెంపును మరో 25 ఏండ్ల పాటు వాయిదా వేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి సూచిస్తున్నారు. 543 సీట్లు ఉన్న లోక్‌సభలో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య 130 అని, పునర్విభజన తర్వాత ఏర్పడే కొత్త లోక్‌సభలో దక్షిణాది ప్రాంతానికి 33 శాతం సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ 50 శాతం సీట్లు పెంచాలనుకుంటే అలా పెరిగే 272 సీట్లతో మొత్తం లోక్‌సభ సీట్ల సంఖ్య 815 అవుతుందని, ఇందులో దక్షిణాది రాష్ట్రాలకు 33 శాతం అంటే 272 సీట్లు ఇవ్వాలని సీఎం రేవంత్ డిమాండ్ చేస్తున్నారు. ఈ సీట్లను తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాలకు ఇప్పుడున్న ప్రొరేటా ప్రాతిపదికన పంచొచ్చని సూచిస్తున్నారు.
నేడు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల రద్దు
డీలిమిటేషన్ తీర్మానంపై చర్చ ఉన్న నేపథ్యంలో నేడు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. తీర్మానం తర్వాత పద్దులపై డిస్కస్ చేయనున్నారు. దీంతో పాటు పంచాయతీరాజ్, మున్సిపల్చట్టాల సవరణ చేయనున్నారు. కొత్తగా ఆరు మున్సిపాలిటీలను, కొత్తగూడెం కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయనున్నారు. కొన్ని గ్రామ పంచాయతీల సరిహద్దులు, పేర్లను సైతం మార్చనున్నారు.