స్తంభించిన శానిటేషన్.. కూకట్‌పల్లి జడ్సీకి రవాణా బాధ్యతలు

పారిశుధ్యం, స్వచ్ఛ కార్యక్రమాలకు ఏటా రూ. వందల కోట్లను వెచ్చిస్తున్నా పరిస్థితి మెరుగుపడకపోవటానికి అధికారుల అక్రమాలే కారణమన్న ఆరోపణలున్నాయి.

Update: 2023-04-05 03:34 GMT

దిశ, సిటీబ్యూరో : పారిశుధ్యం, స్వచ్ఛ కార్యక్రమాలకు ఏటా రూ. వందల కోట్లను వెచ్చిస్తున్నా పరిస్థితి మెరుగుపడకపోవటానికి అధికారుల అక్రమాలే కారణమన్న ఆరోపణలున్నాయి. పైగా ఇప్పటి వరకు శానిటేషన్, చెత్త రవాణాపై ఎలాంటి అవగాహనలేని జోనల్ కమిషనర్‌కు బాధ్యతలు అప్పగించటంతో జోడు పదవుల్లో కొనసాగుతూ, వారు శానిటేషన్‌పై దృష్టి సారించలేకపోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బిన్ ఫ్రీ సిటీ ఫెయిల్

బిన్ ఫ్రీ సిటీ చేసే ప్రయత్నంలో నగరంలోని 1479 చెత్త డబ్బాలను తొలగించడంతో అలవాటులో పొరపాటు అన్న చందంగా డబ్బాల్లో వేయాల్సిన చెత్తను జనాలు ఎక్కడబడితే అక్కడే వేస్తున్నారు. ముఖ్యంగా నగరంలో ఉత్పత్తి అవుతున్న ఆరువేల నుంచి నాలుగున్నర వేల మెట్రిక్ టన్నుల చెత్త నిల్వ చేసేందుకు కావల్సిన ట్రాన్స్‌ఫర్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియ కూడా ఫలించకపోవటం నగరం చెత్తమయంగా తయారయ్యేందుకు మరో కారణమని చెప్పవచ్చు. చెత్త వేసేందుకు డబ్బాల్లేకపోవటం ప్రధాన సమస్యగా మారింది. ఇలాంటి పరిస్థితులు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి డివిజన్‌లోనూ నెలకొంది. తన డివిజన్‌లోని చెత్త కుప్పలను చూసిన తనకే సిగ్గుగా ఉందని ఆమె కౌన్సిల్ సమావేశంలో తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసినా అధికారుల తీరులో మార్పు రాకపోవడం గమనార్హం.

వారానికోసారి.. డబ్బులిస్తేనే..

జీహెచ్ఎంసీ వివిధ దశల వారీగా ప్రస్తుతం 5,250 ఆటో టిప్పర్లను సమకూర్చుకోగా, ఒక్కో ఆటోకు సగటున 500 నుంచి 600 ఇళ్ల నుంచి రోజూ చెత్తను సేకరించాల్సి ఉంది. కానీ ఒక ఆటో, ఇద్దరు కార్మికులుండటంతో ఒకరు డ్రైవర్ కాగా, మరొకరు ఇంటింటి నుంచి చెత్తను సేకరిస్తున్నారు. వారు ప్రతి రోజు కనీసం 50 నుంచి 80, 90 ఇళ్ల నుంచి మాత్రమే చెత్తను సేకరించగల్గుతున్నారు. వారానికోసారి చెత్త సేకరణ కోసం వచ్చే పరిస్థితులు నెలకొనటంతో అంతలోపు ఇంట్లో ఉత్పత్తి అయిన చెత్తను రోడ్లపై, సమీపంలోని ఖాళీ స్థలాల్లో వేసేస్తున్నారు. అలాంటి చెత్త కుప్పలను కూడా స్వచ్చ ఆటో టిప్పర్ కార్మికులే సేకరించి ట్రాన్స్‌ ఫర్‌స్టేషన్‌కు తరలించాలని మెడికల్ ఆఫీసర్లు, ఇంజినీర్లు వారిపై ఒత్తిడి తెస్తున్నారు.

కానీ తమ పని కేవలం డోర్ టు డోర్ సేకరణ మాత్రమేనని వాదిస్తున్నట్లు తెలిసింది. చెత్తను సేకరించిన ఇంటి నుంచి నెలకు రూ. వంద వసూలు చేసుకోవాలని అధికారులు చెబుతున్నా, ఇచ్చేందుకు చాలా మంది నిరాకరిస్తున్నట్లు కార్మికులు వాపోయారు. ఈ సమస్య ఎక్కువగా మధ్యతరగతి, ధనిక వర్గాల్లోనే ఉంటుందని, మాస్ ఏరియాలైన బస్తీలు, మురికివాడల్లోని ప్రజలు సక్రమంగా నెలకు రూ. వంద, రెండు వందలు చెల్లిస్తున్నా, ధనిక, మధ్యతరగతి ప్రజలు తామెందుకు డబ్బులివ్వాలంటూ కార్మికులను బెదిరిస్తుండటంతో అలాంటి వారి నుంచి తాము చెత్తను సేకరించడం లేదని కొందరు కార్మికులే బాహాటంగా చెబుతున్నారు.

Tags:    

Similar News