సికింద్రాబాద్ నుంచి గోవాకు ట్రైన్​

సికింద్రాబాద్ నుంచి గోవాకు నేరుగా ట్రైన్​ ప్రారంభమైంది.

Update: 2024-10-06 14:47 GMT

దిశ,సికింద్రాబాద్ : సికింద్రాబాద్ నుంచి గోవాకు నేరుగా ట్రైన్​ ప్రారంభమైంది. దీనిని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ప్రారంభించారు. గత పదేళ్లలో తెలంగాణ రైల్వేలో గణనీయమైన అభివృద్ది జరిగిందని ఆయన అన్నారు. సికింద్రాబాద్ నుంచి గోవాకు కొత్తగా ప్రవేశపెట్టిన రైలును ఆయన ఆదివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తరపున నవరాత్రుల కానుకగా సికింద్రాబాద్ నుంచి గోవాకు వెళ్తున్న వీక్లీ రెండుసార్లు నడిచే రైలును ప్రారంభించుకుంటున్నట్లు చెప్పారు.

     కొత్తగా సికింద్రాబాద్ –గోవా మధ్య ప్రవేశపెట్టిన ఈ రైలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, పర్యాటకులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండబోతుందన్నారు. ఇప్పటి వరకు సికింద్రాబాద్ నుంచి గోవా వెళ్లేందుకు డైరెక్ట్ ట్రెయిన్ ఉండేది కాదని చెప్పారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ రైలు వల్ల ప్రయాణికులు కేవలం 20 గంటల వ్యవధిలో గోవాకు వెళ్లే సదుపాయం కలుగుతుందన్నారు. గతంలో సికింద్రాబాద్-గోవా మధ్య రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో వెళ్లడం, చాలా మంది సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న విషయం తన దృష్టికి రావడంతో సమస్యను పరిష్కరించాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను అడిగినట్టు తెలిపారు. వారు అంగీకరించి ఈ కొత్త రైలును ప్రకటించడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ వేదిక ద్వారా భారత ప్రధాని మోడీకి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

    దాదాపు 20 గంటలపాటు సాగే ఈ ప్రయాణం తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్ణాటక ప్రజలకు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఈ రైలు సదుపాయం వల్ల తెలంగాణ , కర్నాటక, గోవా మూడు రాష్ట్రాల పర్యాటక రంగాభివృద్ధికి, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతానికి కూడా దోహదపడతాయని అన్నారు. ఈ బై టు వీక్లీ రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుందని, వాస్కోడిగామా నుంచి గురువారం, శనివారం తిరుగు ప్రయాణం అవుతుందన్నారు. ఇది సికింద్రాబాద్, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్‌డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ వాస్కోడిగామా చేరుకుంటుందని తెలిపారు.

Tags:    

Similar News