దిశ, చార్మినార్ : బండ్లగూడ ప్రాంతంలో ఘోరం జరిగింది. పల్సర్ బైక్ అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో ముగ్గురు స్నేహితులు మృతిచెందారు. ఈ దారుణమైన ఘటన సోమవారం తెల్లవారుజామున బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బండ్లగూడ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... సైదాబాద్ శంకేశ్వర్ బజార్‌కు చెందిన బ్యాగరి శ్రీహరి (28) వృత్తి రిత్యా చెఫ్. అదే ప్రాంతానికి చెందిన సందీప్ (20) , అభిలాష్ (20)లు స్నేహితులు. వీళ్లు ముగ్గురు సోమవారం సైదాబాద్‌లో బోనాల పండుగ సందర్భంగా ఎంజాయ్ చేయడానికి వెళ్లారు. అంతలోనే అభిలాష్ సోదరి వద్ద నుంచి ఇంటికి రమ్మని కాల్ వచ్చింది. దీంతో అభిలాష్‌ను మైలార్ దేవ్ పల్లిలో ఉండే అతని సోదరి ఇంటి వద్ద వదిలిపెట్టడానికి పల్సర్ బైక్‌పై శ్రీహరి, సందీప్, అభిలాష్‌లు ముగ్గురు బయలుదేరారు. చాంద్రాయణగుట్ట మీదుగా వెళ్తుండగా హాషమాబాద్ వద్దకు చేరుకోగానే బైక్ అదుపు తప్పి వేగంగా రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న శ్రీహరి, సందీప్, అభిలాష్‌లు ముగ్గురు బైక్‌పై నుంచి 20మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సందీప్, అభిలాష్‌లకు బలమైన గాయాలు కావడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. శ్రీహరికి కూడా తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీహరికూడా మృతిచెందాడు. సోమవారం తెల్లవారుజామున 3.45గంటల ప్రాంతంలో బండ్లగూడ ఎఎస్ఐ కృష్ణారెడ్డి తన బృందంతో హాషమాబాద్లో ఏటీఎం సెంటర్ ను తనిఖీ చేస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.