అసైన్డ్ భూముల్లో దర్జాగా నిర్మాణాలు.. రూ.50 కోట్ల సంపద ఆవిరి

అసైన్డ్ భూముల్లో దర్జాగా నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

Update: 2024-12-28 03:23 GMT

దిశ, కుత్బుల్లాపూర్: నిజాంపేట్ అసైన్డ్ భూముల్లో దర్జాగా నిర్మాణాలు చేపడుతూ అక్రమార్కులు కబ్జాలకు పాల్పడుతున్నారు. కోట్లాది రూపాయలు భూమి కబ్జా అవుతున్నా అధికారులు పట్టించుకోక పోవడం విమర్శలకు తావిస్తోంది. నిజాంపేట్ సర్వే నెంబర్ 95,96,98కి రెక్కలొచ్చాయి. రూ.50 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని రోజుకింత చొప్పున దర్జాగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఊర్లో వ్యవసాయం సాగిన రోజుల్లో భూమి లేని నిరుపేద కుటుంబాల బతుకుదెరువుకు అప్పటి ప్రభుత్వం ఆయా సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూములను పంచింది.

అసైన్డ్ చేసిన ఈ ప్రభుత్వ భూమిపై ఎలాంటి క్రయ, విక్రయ హక్కులు గానీ, వ్యవసాయం కాకుండా ఇతర అవసరాలకు వినియోగించే అవకాశం చట్ట ప్రకారం లేదు. హైదరాబాద్ మహా నగర విస్తరణలో భాగంగా పల్లెలు పోయి పట్నంగా అవతరించిన నిజాంపేట్ లో ప్రస్తుతం ఈ భూమి వ్యవసాయం చేసుకునేందుకు అవసరం లేనిదిగా మారిపోయింది. ప్రస్తుతం ఈ సర్వే నెంబర్ లో ఎకరం పైబడిన ప్రభుత్వ భూమిని అసైన్డ్ చేయబడిన వ్యక్తులు దర్జాగా ప్లాట్స్ చేసి 100 చదరపు గజాలు విస్తీర్ణం లోని ఒక్కో ప్లాట్ రూ. 25 నుండి 35 లక్షల వరకు అమ్ముతూ సర్కార్ జాగను ఖతం చేస్తున్నారు. ఇంత తంతు జరుగుతున్నా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, నాలాలపై ప్లాట్స్ నిర్మించినందుకు ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకుండా మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ స్థలాలు కాపాడటంలో ఏ ఒక్క ప్రభుత్వ యంత్రాంగానికి చిత్తశుద్ధి లేకపోవడం విస్మయానికి గురి చేస్తుంది.

నాలాలను సైతం వదలని బిల్డర్...

సర్వే నెంబర్ 95,96,98 ప్రభుత్వ భూమి లో నిజాంపేట్ తురక చెరువు నాలాను సైతం వదలకుండా ఓ బిల్డర్ కబ్జా చేస్తుండు. ఈ సర్వే నెంబర్ల మీదుగా వెళ్లిన నాలాను గతంలో పంచాయతీ హయాంలో 99 సర్వే నెంబర్ లో కట్టిన తన అపార్ట్మెంట్ పక్కనే నాలాపై సుమారు 400 చదరపు గజాలలో ప్రభుత్వ స్థలం కబ్జా చేయడం వెనుక నిజాంపేట్ కు చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. ఈ కబ్జాలను తొలగించకుండా రెవిన్యూ అధికారులపై ఒత్తిడి తెస్తూ బిల్డర్ కబ్జా కాండను నడుపుతున్నట్లు వినికిడి.

ప్రభుత్వ స్థలంలో నిర్మించిన నిర్మాణాలను తొలగిస్తాం: తహసీల్దార్ పూల్ సింగ్...

నిజాంపేట్ సర్వే నెంబర్ 95,96,98లో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తాం.సరైన సిబ్బంది లేకపోవడం వల్ల క్షేత్ర స్థాయిలో అక్రమ నిర్మాణాలను నిలువరించలేకపోతున్నాం. వరుస సెలవులు కావడంతో ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు వెలిసాయి.వీటిని పూర్తిగా తొలగించి కబ్జాదారులపై కేసులు నమోదు చేస్తాం.


Similar News