ఆరు జంక్షన్లు, ఏడు బ్రిడ్జిలు.. సకాలంలో పూర్తవుతాయా..?

జీహెచ్ఎంసీలో సీనియర్ ఇంజినీర్ల కొరత తీవ్రమైంది..

Update: 2024-12-20 02:31 GMT

దిశ, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో సీనియర్ ఇంజినీర్ల కొరత తీవ్రమైంది. ఒక పక్క ప్రభుత్వం హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్సఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(హెచ్-సిటీ)లో భాగంగానే చేపట్టనున్న ప్రాజెక్టులను త్వరితిగతిన పూర్తిచేయాలని టార్గెట్లు పెట్టిన విషయం తెలిసిందే. మరో పక్క సీనియర్ ఇంజినీర్లంతా ఒక్కొక్కరుగా రిటైర్ అవుతున్నారు. జీహెచ్ఎంసీ ప్రాజెక్టు, మెయింటెనెన్స్, స్టాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్లాన్(ఎస్ఎన్డీపీ), హౌసింగ్ విభాగం, లేక్స్ విభాగాల్లో సీనియర్ ఇంజినీర్ల కొరత తీవ్రంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌లో రూ.7,032 కోట్ల పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన మంజూరు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పనులను పూర్తి చేయాలంటే ఇంజినీర్లను నడిపించే నాయకుడు కావాలి. కానీ చీఫ్ ఇంజినీర్‌గా పనిచేసిన జియావుద్దీన్ రిటైర్ అయ్యారు. ఈనెలాఖరులో పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ, జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ (ప్రాజెక్టు) దేవానంద్ రిటైర్ కానున్నారు. ప్రస్తుతం ఉన్న చీఫ్ ఇంజినీర్లు సైతం ఇన్‌చార్జీలుగా కొనసాగుతున్నారు. అయితే రిటైర్ అయ్యే దేవానంద్ పదవీకాలం పొడిగిస్తారా? ఉన్న ఇన్‌చార్జీలకు ప్రమోషన్లు ఇస్తారా? అనేది చూడాల్సిందే.

అంతా ఇన్‌చార్జీలే..

జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో ప్రాజెక్టు విభాగం, మెయింటెనెన్స్ విభాగం, హౌసింగ్ విభాగం, ఎస్ఎన్డీపీ, క్వాలిటీ కంట్రోల్, ఎలక్ట్రికల్ విభాగం ఉన్నాయి. ఒక్క ప్రాజెక్టు విభాగానికే రెగ్యులర్ చీఫ్ ఇంజినీర్‌గా దేవానంద్ కొనసాగుతున్నారు. కాగా ఈనెలాఖరు వరకే ఆయన పదవీకాలం పూర్తికానుంది. ఎస్ఎన్డీపీ సూపరింటెండెంట్ ఇంజినీర్‌గా ఉన్న ఎస్.భాస్కర్ రెడ్డికి మెయింటెనెన్స్ విభాగం సీఈ బాధ్యతలు అప్పగించారు. సాలీడ్‌వేస్ట్ విభాగం సూపరింటెండెంట్ ఇంజినీర్‌గా కోటేశ్వర్ రావుకు ఎస్ఎన్డీపీ సీఈ బాధ్యతలు అప్పగించారు. ఈ మధ్యనే హౌసింగ్ చీఫ్ ఇంజినీర్‌గా పనిచేసిన అనిల్ రాజ్ రిటైర్ అయ్యారు. దీంతో ఆ పోస్టు ఖాళీగానే ఉంది. ప్రాజెక్టు విభాగంలో ముగ్గురు సూపరింటెండెంట్ ఇంజినీర్లు ఉండాలి. కానీ ప్రస్తుతం ఇద్దరే ఉన్నారు. ఆ ఇద్దరిలో శ్రీలక్ష్మికి ప్రాజెక్టు విభాగంతోపాటు సికింద్రాబాద్ జోన్ మెయింటెనెన్స్ విభాగం బాధ్యతలు కూడా అప్పగించారు. దీంతోపాటు ఏఈ నుంచి సీఈ వరకు 350 మంది ఇంజినీర్లు అవసరమని అధికారులు చెబుతున్నారు. కానీ కొత్తగా వచ్చిన 112 మంది ఇంజినీర్లతో పాటు మొత్తం 200 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మరో 150 మంది ఇంజినీర్ల కొరత ఉందని అధికారులు చెబుతున్నారు.

రూ.7,032కోట్ల ప్రాజెక్టులు..

కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికాలంలో కొత్తగా కేబీఆర్ పార్కు చుట్టూ రోడ్డు విస్తరణతో పాటు, ఆరు జంక్షన్లలో ఏడు స్టీల్ బ్రిడ్జీలు, ఏడు అండర్ పాస్‌లు నిర్మించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్కింగ్ కూడా చేశారు. వారం రోజుల్లో టెండర్లు పూర్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు ఏడాదిన్నరలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి చీఫ్ ఇంజినీర్లు ఉంటేనే ప్రాజెక్టులు సకాలంలో పూర్తవుతాయని, ఈ విషయంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులు కోరుతున్నారు.


Similar News