అభివృద్ధి తప్ప నేనెప్పుడు అవినీతికి పాల్పడలేదు : ఎమ్మెల్యే గాంధీ
తనకు నియోజకవర్గ అభివృద్ధి మీద తప్ప.. మరే అంశాలపై దృష్టి
దిశ, శేరిలింగంపల్లి: తనకు నియోజకవర్గ అభివృద్ధి మీద తప్ప.. మరే అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని, అభివృద్ధి పనులు తప్ప.. పైరవీల గూర్చి నేనెప్పుడూ ఏ ముఖ్యమంత్రి దగ్గరకు ఒక్క కాగితం తీసుకుపోలేదని.. నాకు ఆ అవసరం కూడా లేదని స్పష్టం చేశారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరేకపూడి గాంధీ. శుక్రవారం తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రూ.1605 కోట్ల నిధులు కేటాయించారని వాటితో గచ్చిబౌలిలో జంక్షన్, విప్రో సర్కిల్ జంక్షన్, అండర్ గ్రౌండ్ రోడ్లు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయం నుండి గచ్చిబౌలి జంక్షన్ వరకు 200 ఫీట్ల రోడ్డు విస్తరణ, అంజయ్య నగర్ నుండి రాంకీ టవర్ వరకు రోడ్డు విస్తరణ, అభివృద్ధి. అలాగే నేషనల్ హైవే 65 నుండి అమీన్ పూర్ వరకు రోడ్డు విస్తరణ, మియాపూర్ నుండి అల్వీన్ కాలనీ ఎక్స్ రోడ్డు వరకు ఫ్లై ఓవర్, అల్వీన్ కాలనీ నుండి గచ్చిబౌలి వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే గాంధీ తెలిపారు.
శేరిలింగంపల్లి రైల్వే ఆర్ ఓబీ నిర్మాణం కోసం నిధులు కేటాయించారని, మొత్తం శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.1605 కోట్ల నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రగతి నగర్ నుండి జేఎన్టీయూ వరకు, ఉషా ముళ్ళపూడి రోడ్డు విస్తరణ, అభివృద్ధి కోసం మరో రూ. 1000 కోట్లు కేటాయించాలని సీఎంను కోరినట్లు ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. అపర్ణ నుండి గంగారం, శ్రీదేవి రోడ్డును కూడా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. గాంధీకి అభివృద్ధి ఎజెండా మినహా, అవినీతి ఎజెండా లేదని, తాను గత 11 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నానని, తన దగ్గరకు వచ్చిన ఏ ఒక్కరిని ఏ పార్టీ అని అడగకుండా పనులు చేశానని, మచ్చలేని మనిషిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. నన్ను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు సదా రుణపడి ఉంటానని గాంధీ తెలిపారు. ఎలాంటి అవినీతికి పాల్పడకుండా నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. నాపై కావాలని బురద చల్లేందుకు ఎవరు ప్రయత్నించినా సహించనని, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంత దూరమైన వెళ్తా.. నా మీద దుష్ప్రచారం చేయడం మానుకోండి అని హితవు పలికారు.
అరగుంట కబ్జా అని తెలిచి మీకే ఇచ్చేస్తా..
తాను కబ్జాలకు పాల్పడినట్లు ఓ వార్తా పత్రికలో వచ్చిన కథనంలో ఎలాంటి నిజం లేదని, తాను కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ ఆరేకపూడి గాంధీ ప్రకటించారు. తాను గతంలోనే ప్రభుత్వ నిబంధనలకు లోబడి భూమిని కొనుగోలు చేశానని అన్నారు. నిన్న 30 ఎకరాల కబ్జా అని రాసిన వారే ఇవాళ 6 ఎకరాల కబ్జా అని రాశారని, అది రేపటికి 4 ఎకరాలు అవుతుందని వారు రాసింది వారికే స్పష్టతలేదని అన్నారు. తాను కొనుగోలు చేసిన డాక్యుమెంట్లను, ఇతర కాగితాలను మీడియా ముందు ఉంచారు. ఎక్కడైనా తాను నిబంధనలకు విరుద్ధంగా భూమిని పొందినట్లు కానీ, అవినీతికి పాల్పడినట్లు కానీ నిరూపించక పోతే సంబంధిత పత్రికపై, అలాగే అవాస్తవాలు ప్రసారం చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు.