Former Minister Motkupalli Narsimhulu : మాదిగ జాతి దశాబ్దాల పోరాటాలకు ఫలితం దక్కింది
మాదిగ జాతి దశాబ్దాల పోరాటాలకు ఫలితం దక్కిందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.
దిశ, ఖైరతాబాద్ : మాదిగ జాతి దశాబ్దాల పోరాటాలకు ఫలితం దక్కిందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదిగ జాతి మొత్తం నిర్వీర్యమైపోయిన పరిస్థితుల్లో సుప్రీం కోర్టు ప్రాణం పోసిందన్నారు. 2004 వరకు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ చేశారన్నారు. 2004 తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడం జరిగిందన్నారు. దీంతో గడిచిన 20 సంవత్సరాలుగా మాదిగ, మాదిగ ఉప కులాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. గత ఎన్నికల్లో మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఆ నష్టాన్ని పూడ్చుకునే అవకాశం
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాదిగల జీవితాల్లో వెలుగు నింపాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక్క ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదని, ఎమ్మెల్యేల టికెట్ల పంపిణీలో కూడా అన్యాయం జరిగిందన్నారు. ఏబీసీడీ వర్గీకరణ వలన మాదిగ ఉప కులాలకు విద్యా, ఉద్యోగాల్లో మేలు జరుగుతుందని, వీటికి తోడు రాజకీయశక్తి కూడా ఉండాలన్నారు. వర్గీకరణ కోసం అసెంబ్లీలో ఆర్డినెన్స్ తీసుకువచ్చేంత వరకు నియామకాలకు నోటీఫికేషన్లు ఆపాలన్నారు. మాల సామాజికవర్గం కలిసి రావాలని, కలిసి ఉంటే తమకు జరుగుతున్న అన్యాయాలపైన పోరాటం చేయవచ్చన్నారు.