Prof. Purushotham Reddy: హైడ్రా చొరవకు అభినందనలు
పీసీబీ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఇరిగేషన్, రెవెన్యూ ఇలా ప్రభుత్వ శాఖలన్నీ సహకరించినప్పడు హైడ్రా లక్ష్యాలు చేరుకోవడం సులభం అవుతుందని ప్రముఖ పర్యావరణ వేత్త, ప్రొఫెసర్ పురుషొత్తం రెడ్డి(Prof. Purushotham Reddy) అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: పీసీబీ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఇరిగేషన్, రెవెన్యూ ఇలా ప్రభుత్వ శాఖలన్నీ సహకరించినప్పడు హైడ్రా లక్ష్యాలు చేరుకోవడం సులభం అవుతుందని ప్రముఖ పర్యావరణ వేత్త, ప్రొఫెసర్ పురుషొత్తం రెడ్డి(Prof. Purushotham Reddy) అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా హైడ్రా వచ్చిన తర్వాత.. చెరువులేంటి? బఫర్ జోన్(Buffer zone) ఏంటి? క్యాచ్‌మెంట్ ఏరియా అంటే ఏంటి? ఇంటి స్థలం లేదా ఇల్లు కొనాలంటే.. అది ప్రభుత్వ భూమినా? చెరువు గర్భంలో ఉందా? అనేది సామాన్యులు కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇది ప్రతి ఒక్కరికీ అవసరమని పురుషోత్తమ్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో అర్బనైజేషన్ వేగంగా అవుతోందని, ఇలాంటి తరుణంలో పట్టణాలు ఎలా ఉండాలి? పర్యావరణాన్ని కాపాడడం ఎలా? పీసీబీ ఎలా పని చేయాలి? ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఒక పట్టణ విధానాన్ని రూపొందించాలని సూచించారు.
స్పష్టమైన విధానాలు, కచ్చితంగా చట్టాల అమలు జరిగినప్పడే భవిష్యత్ తరాలకు పర్యావరణంతో కూడిన మెరుగైన జీవనాన్ని అందింగలమని, ఎంతో చక్కటి వాతావరణం ఉన్న నగరాన్ని కాపాడుకోవడం అందరూ బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. గొలుసుకట్టు చెరువులు, కాలువల పరిరక్షణ, పునరుద్ధరణకు తక్కువ ఖర్చుతో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై హైడ్రా కార్యాలయంలో సోమవారం హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ప్రొ. కె. పురుషోత్తమ్ రెడ్డి మాట్లాడారు. నగర ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. హైడ్రాకు అప్పగించిన టాస్కును ముందుగా కమిషనర్ రంగనాథ్ వివరించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణకు తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు. చెరువుల పరిరక్షణే కాదు.. కాలుష్య కారణాలపైనా దృష్టి పెట్టాలని ప్రొ. కె. పురుషోత్తమ్ రెడ్డి సూచించారు.వర్షపు నీటి పరిరక్షణ, నీటితో నిండిన చెరువులు, భూగర్భజలాలు, భూమి డ్రైగా మారకుండా.. భూమి కాలష్యమయం అవ్వకుండా హైడ్రా కాపాడాలని సూచించారు.
చెరువుకు నీరు ఎలా వస్తోంది? ఆ చెరువు నిండిన తర్వాత నీరు ఎటు వెళ్లాలి? అనే అంశాలను పరిగణనలోకి తీసుకుంటే నగరంలో వర్షాకాలం వరదలు, ఎండాకాలం భూగర్భ జలాలు అడుగంటే పరిస్థితే ఉండదని ప్రొఫెసర్ అన్నారు. జహీరాబాద్ దగ్గరలోని కొహిర్ మండలం గొట్టిగారిపల్లెలో చెరువులను పరిరక్షించుకునే విధానం బాగా జరిగిందని, ఏలాంటి నీటి వనరులు లేని గ్రామంలో ఇప్పుడు మూడు పంటలు పండిస్తున్నారని, చెరువుల పరిరక్షణ తీరును పరిశీలించాలని సూచించారు. జీహెచ్ఎంసీ, పీసీబీ, ఇరిగేషన్, రెవెన్యూ విభాగాలతో పాటు.. పర్యావరణ ప్రేమికులు, నగర అభివృద్ధిన ఆకాంక్షిన యువతతో సమావేశాలు ఏర్పాటు చేసి.. చెరువులు, కాలువలు, పర్యావరణ పరిరక్షణలో నగర ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలని పురుషొత్తం రెడ్డి సూచించారు.