MLA:వర్గ పోరాటాల చైతన్యమే నేటి కుల చైతన్యానికి స్ఫూర్తి

సమసమాజమే లక్ష్యంగా కమ్యూనిస్టు పార్టీ జరిపిన వర్గపోరాటాల చైతన్యమే నేటి కుల చైతన్యానికి స్ఫూర్తి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Koonanneni Sambasivarao) అన్నారు.

Update: 2024-10-28 15:22 GMT

దిశ, హిమాయత్ నగర్: సమసమాజమే లక్ష్యంగా కమ్యూనిస్టు పార్టీ జరిపిన వర్గపోరాటాల చైతన్యమే నేటి కుల చైతన్యానికి స్ఫూర్తి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Koonanneni Sambasivarao) అన్నారు. బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు తాటిపాముల వెంకట్రాములు అధ్యక్షతన సోమవారం బషీర్ ప్రెస్ క్లబ్ లో జనగణనలో కులగణన రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్.బాల మల్లేష్, వక్తలు గా విశ్రాంత ఐఏఎస్ అధికారి టి.చిరంజీవులు, ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. బీసీలకు తరతరాలుగా అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో వారి న్యాయం కోసం జరుగుతున్న బీసీ ఉద్యమాలకు కమ్యూనిస్టు పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు.

టి.చిరంజీవులు మాట్లాడుతూ.. సమాజంలో అన్ని విధాలుగా వెనుకబాటు తనానికి గురైన బీసీలకు పాలక వర్గాలు ఎప్పుడు అన్యాయం చేస్తునే ఉన్నాయని మండి పడ్డారు. ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ మాట్లాడుతూ.. భారతదేశంలో కులం అనేది సామాజిక వాస్తవం. మనకు ఇష్టమున్న లేకపోయినా ఏదో ఒక కులంలో పుట్టాల్సిందే నన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాల మల్లేష్ మాట్లాడుతూ.. బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించే వరకు బీసీ హక్కుల సాధన సమితి విశ్రమించబోదని అన్నారు. తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.అంజయ్య నాయక్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.కాంతయ్య, జి.సాయిల్ గౌడ్ లు పాల్గొని మాట్లాడారు.


Similar News