TG NAB: డ్రగ్స్ మాట వినపడితే టీజీ న్యాబ్ ప్రత్యక్షం.. ఈ 31 కి స్పెషల్ ఆపరేషన్

20 వేల మందిపై టీజీ న్యాబ్ అధికారులు నిఘా పెట్టారు.

Update: 2024-12-13 02:25 GMT

దిశ, సిటీక్రైం : 20 వేల మందిపై టీజీ న్యాబ్ అధికారులు నిఘా పెట్టారు. న్యూ ఈయర్ వేడుకల్లో మాదకద్రవ్యాల ఊసే ఉండకుండా చేసేందుకు నార్కోటిక్ అధికారులు వారి బృందాలతో ప్రత్యేక సెర్చ్ అపరేషన్‌లను మొదలుపెట్టారు. ఈ నేపధ్యంలో టీజీ న్యాబ్ ఇప్పటి వరకు నమోదు చేసిన కేసులతో పాటు గత ఐదు సంవత్సరాల కిందట నమోదైన మాదకద్రవ్యాల సరఫరా కేసులలో అరెస్టైన వారి రికార్డులను పరిశీలిస్తుంది. వీరి నుంచి డ్రగ్స్ తీసుకుని సేవించి దొరికిపోయిన వారి చిట్టాను టీజీ న్యాబ్ జల్లెడపడుతుంది. ఈ దందా చేసే వారితో ఆర్ధిక లావాదేవిల సంబంధాలు ఉన్న వారందరీ లిస్టును రెడీ చేసుకున్నారు. ఇలా టీజీ న్యాబ్ దగ్గర దాదాపు 20 వేల మందికి పై డాటా రెడీగా ఉంది. వీరిని టీజీ న్యాబ్ అధికారులు నిరంతరం ఫాలో అవుతున్నారు. డ్రగ్స్ సంబంధించిన హాట్ స్పాట్స్‌లలో వీరు అడుగుపెడితే చాలు టీజీ న్యాబ్ అధికారులకు అలర్ట్ వచ్చేలా ఓ ప్రక్రీయను అభివృద్ధి చేసుకున్నారు.

ఈ ప్రణాళికతో టీజీ న్యాబ్ అధికారులు కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా తెలంగాణతో పాటు హైదరాబాద్‌కు మాదకద్రవ్యాలు రానివ్వకుండా పూర్తిగా అడ్డుకట్ట వేస్తున్నారు. కొత్త సంవత్సరం స్వాగత వేడుకల్లో హైదరాబాద్‌లో ఈ మాదకద్రవ్యాలకు భారీ డిమాండ్ ఉంటుందనే కోణంలో గోవా, ఢిల్లీ, బెంగళూరు, ముంబాయి తదితర రాష్ట్రాల్లోని అక్రమ డ్రగ్స్ మాఫియా వీటి సప్లైకి అనేక రహస్య మార్గాల కోసం అన్వేషిస్తున్నారని గుర్తించి అప్రమత్తమైన టీజీ న్యాబ్ అధికారులు అనుమానితులను సీక్రెట్‌గా వెంటాడుతున్నారు. నగరంలో నైజీరియన్ దేశానికి చెందిన వారు ఉండే టోలీచౌకి, సైనిక్ పురి, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో నజర్ పెంచారు. మాదకద్రవ్యాల సరఫరా బెడద తీవ్రంగా ఉండే రాష్ట్రాల నుంచి వచ్చే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కూడా టీజీ న్యాబ్ అధికారులు దృష్టిపెట్టారు. ఆన్‌లైన్ వేదికలతో పాటు డార్క్ వెబ్ పై కూడా టీజీ న్యాబ్ అధికారులు సాంకేతిక టూల్స్‌తో డ్రగ్స్ మాఫియా దందాపై ఫోకస్ పెట్టారు. మరో వైపు రాష్ట్రంలోని పోలీసు, ఎక్సైజ్, ఇతర ప్రభుత్వ ఎజెన్సిల అధికారులను, ఇతర రాష్ట్రలు, కేంద్ర నార్కోటిక్ బ్యూరో ఏజెన్సిలతో సమన్వయం చేసుకుంటున్నారు. డ్రగ్స్ దందాపై సమాచారం ఉంటే డయల్ 100కు ఫోన్ చేయాలని పోలీసులు అధికారులు కోరుతున్నారు.

Tags:    

Similar News