పెండింగ్ నిధులు వెంటనే చెల్లించండి: తెలంగాణ సర్పంచుల సంఘం డిమాండ్
పెండింగ్ నిధులు వెంటనే చెల్లించాలని తెలంగాణ సర్పంచుల సంఘం డిమాండ్ చేసింది..
దిశ, వెబ్ డెస్క్: గ్రామ పంచాయతీలకు రావాల్సిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర సర్పంచుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు శాసన మండలి ఎమ్మెల్సీ కవితను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహారెడ్డి, నవీన్ రెడ్డితో పాటు తదితరులు కలిశారు. 2019 - 2024 కాలవ్యవధిలో తమ పంచాయతీల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. 5 లక్షల నుంచి 50 లక్షల వరకు బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయని చెప్పారు. నిధులు అందకపోయినా సొంత గ్రామాలను అభివృద్ధి చేయాలని, ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం చేశామని తెలిపారు. ఈ క్రమంలో సొంత డబ్బులు వెచ్చించి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. తమ పాలకమండలి గడువు ముగిసి పది నెలలు అయవుతున్నప్పటికీ పెండింగ్ బిల్లులు మాత్రం ఇంకా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 12,769 గ్రామపంచాయతీల సర్పంచుల బాధలు వెలకట్టలేనివన్నారు. అప్పులు చేసి గ్రామాభివృద్ధికి ఖర్చుపెట్టిన బిల్లులు అందక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. అధికారులకు, ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా ఫలితం శూన్యంగా ఉందన్నారు. పెండింగ్ బిల్లులు మొత్తం వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని గుత్త సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితను కోరారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.