నారాయణ స్కూల్ లో విద్యార్థిపై ఉపాధ్యాయుడి దాష్టీకం
దిల్ సుఖ్ నగర్ లోని నారాయణ స్కూల్ లో విద్యార్థిని ఉపాధ్యాయుడు విచక్షణారహితంగా కొట్టాడు
దిశ, చైతన్యపురి : దిల్ సుఖ్ నగర్ లోని నారాయణ స్కూల్ లో విద్యార్థిని ఉపాధ్యాయుడు విచక్షణారహితంగా కొట్టాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు స్కూల్ ముందు గురువారం ఉదయం ధర్నా చేపట్టారు. దిల్ సుఖ్ నగర్ లోని సాయిబాబా ఆలయం వెనకాల ఉన్న అన్నపూర్ణ కాంప్లెక్స్ నారాయణ స్కూల్ లో వంశీకిరణ్ సాగర్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. పక్కన ఉన్న విద్యార్ధితో మాట్లాడాడని అయ్యప్ప స్వామి మాల ధరించిన వంశీకిరణ్ సాగర్ ను విచక్షణారహితంగా గణితం ఉపాధ్యాయుడు యూసఫ్ రాజా కర్రతో కొట్టాడు. నోటికొచ్చిన బూతులు తిడుతూ హింసించాడు.
విషయం తెలుసుకున్న బాలుడు తండ్రి అమరేందర్ సాగర్ తన కుటుంబ సభ్యులు, ఎబివిపి నాయకులు, అయ్యప్పలతో కలిసి గురువారం ఉదయం స్కూల్ ముందు ధర్నా చేపట్టారు. ఉపాధ్యాయుడు క్రిస్టియన్ కావడంతోనే అయ్యప్ప మాలలో ఉన్న మా కుమారుడిని అకారణంగా కొట్టి దుర్భాశలాడాడని వెంటనే అతడిని స్కూల్ నుంచి సస్పెండ్ చేసి కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. తీవ్ర ఆందోళనల మధ్య స్కూల్ ప్రిన్సిపాల్ విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడిపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడంతో విద్యార్ధి కుటుంబ సభ్యులు, ఎబివిపి నాయకులు, అయ్యప్పలు ఆందోళన విరమించారు.