ఖైరతాబాద్ సర్కిల్ లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు

ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి.

Update: 2024-12-19 14:21 GMT

దిశ, ఖైరతాబాద్ : ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. మొదట రెండు, మూడు అంతస్తుల నివాసాల కోసమని అనుమతులు తీసుకుని ఆ తరువాత ఐదు, ఆరు, అంతస్తులు అక్రమంగా వాణిజ్య భవనాలుగా నిర్మిస్తున్నారు అని వినికిడి.. వాటిపై అధికారులకు ఎన్ని ఫిర్యాదులు అందిన చుట్టం చూపుగా వెళ్లి తూతూ మంత్రంగా చర్యలు చేపడుతూ అధికారులు వారి వృత్తి రీత్యా విఫలమవుతున్నారు అని విమర్శలున్నాయి.

ప్రభుత్వ ఖజానాకు గండి

జిహెచ్ఎంసి నుంచి అనుమతులు పొందేందుకు రుసుములు చెల్లించి ఆ తరువాత అనుమతులకు లోబడి నిర్మాణాలు చేపట్టాలి. కానీ రెండు, మూడు అంతస్తులకు అనుమతులు తీసుకొని ఐదు, ఆరు అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు.. ఇందులో మర్మమేంటంటే కిందిస్థాయి అధికారుల సమన్వయంతోనే అక్రమ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వానికి రుసుము రూపంలో రావాల్సిన ఖజానా కాస్త పక్క దారిన పడుతుంది. అలాంటి కొందరు అధికారుల వల్ల ప్రభుత్వ ఖజానాకు గండిపడుతుంది.

అమీర్పేటలోని ఎస్సార్ నగర్ కమ్యూనిటీ హాల్ సమీపంలో అక్రమ నిర్మాణం చేపట్టారు. నిర్మాణదారులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల నిర్మాణం చేపడుతుండగా సెప్టెంబర్ 26న మధ్యప్రదేశ్ కు చెందిన మేస్త్రి పనిచేసే వినోద్ (24) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు 5వ అంతస్తు నుండి కిందపడి మృతి చెందాడు. ఘటనలో యజమాని నారాయణరావు అలియాస్ కాకినాడ శ్రీను, బిల్డర్ మాల్యాద్రి లపై ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు కూడా అయింది.. జిహెచ్ఎంసి అధికారులకు నిర్మాణంపై ఫిర్యాదులు కూడా అందాయి కానీ అధికారులు చర్యలు తూతూ మంత్రంగా చేపట్టారు. ఇప్పటికీ నిర్మాణ పనులు మాత్రం యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..


Similar News