సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోండి

వర్షాకాలంలో డెంగీ, మలేరియా వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున వాటి నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు.

Update: 2024-07-02 11:37 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో : వర్షాకాలంలో డెంగీ, మలేరియా వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున వాటి నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన దోమల నియంత్రణ, దోమల వల్ల సంక్రమించే వ్యాధుల నియంత్రణపై నిర్వహించిన డీసీసీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో డెంగీ, మలేరియా, విష జ్వరాలు ప్రబలకుండా వ్యాధుల నివారణపై జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖ నివారణ చర్యలపై దృష్టి పెట్టడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. డెంగీ వ్యాధి రాకుండా ఉండేందుకు అన్ని వైద్య ఆరోగ్య కేంద్రాలలో వైద్య సౌకర్యాలు,

     టెస్టింగ్ కిట్స్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. గత ఐదు సంవత్సరాలలో ఎక్కువ డెంగీ కేసులు ఏ ప్రాంతాలలో నమోదౌతున్నాయో పరిశీలించి వార్డ్ వైజ్, సర్కిల్ వైజ్, యూపీహెచ్ సీ వారీగా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల, రెసిడెన్షియల్ వసతి గృహాల్లో పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా, శానిటేషన్ బాగుండేలా వసతి గృహాల సంక్షేమ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో డెంగీ కేసులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉన్నందున ఇప్పటి నుండే ప్రత్యేక

    కార్యాచరణతో నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతి పట్టణ ఆరోగ్య కేంద్రం, బస్తీ దవాఖానాలలో అన్ని రకాల మందులు సరిపడా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చిన పేషంట్లలో డెంగీ పాజిటివ్ వస్తే తప్పకుండా వ్యాధి నిర్ధారణ చేసి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి లేదా జిల్లా మలేరియా అధికారికి తెలియజేయాలని, లేని పక్షంలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి, జీహెచ్ఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎం ఓహెచ్) రాంబాబు, చీఫ్ ఏంటమాలాజిస్ట్, డిస్టిక్ సర్వేలెన్సు ఆఫీసర్ డాక్టర్ హర్ష, ఇంచార్జ్ డీఎంఓ నిరంజన్, జిల్లా అధికారులు యాదయ్య, కోటాజి, ఇలియాజ్ అహ్మద్, ఆశన్న తదితరులు పాల్గొన్నారు. 

Similar News