అతనొక్కడే.. శేరిలింగంపల్లి జోన్ లో మోనార్క్ బాస్..
గత కొంతకాలంగా ఆయా ప్రభుత్వ శాఖల్లోని ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతుంది.
దిశ, శేరిలింగంపల్లి : గత కొంతకాలంగా ఆయా ప్రభుత్వ శాఖల్లోని ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతుంది. అన్నీ తామై వ్యవహరిస్తూ తాము చెప్పిందే వేదం.. తాము చేసిందే శాసనం అన్న తీరుగా జులుం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు కిందిస్థాయి ఉద్యోగుల నుండి వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీలోని ఉన్నతాధికారుల పై ఈ ఆరోపణలు సర్వసాధారణంగా మారాయి. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ఓ బాస్ ప్రదర్శిస్తున్న ఒంటెద్దు పోకడలతో ఇక్కడ పనిచేసేందుకు కిందిస్థాయి సిబ్బంది జంకుతున్నారు అంటే ఆయన టార్చర్ ఏ స్థాయిలో ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. లాంగ్ లీవ్ లు పెట్టి మరీ అటు నుండి అంటే వేరే చోటికి బదిలీలు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఉద్యోగులు వెళ్లిపోగా.. ఇంకొందరు ఉద్యోగులు కూడా రేపో మాపో వెళ్లి పోయేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులకు మాత్రం ఇక్కడ పంట పండుతుంది. పెద్ద సార్ నుండి ఎలాంటి ఒత్తిళ్లు, ఇబ్బందులు ఉండవు. వారు బదిలీ అయినా రిలీవ్ చేయకుండా అడ్డుకుని మరి వారిని ఒక సెక్షన్ లో కాకుంటే మరో సెక్షన్ లో కూర్చోబెట్టి ప్రాధాన్యత కల్పిస్తారు అని జీహెచ్ఎంసీ ఉద్యోగులు చెప్పుకుంటున్నారు.
టీపీఎస్ సెక్షన్ నుండి మొదలు..
శేరిలింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు ఉన్న పళంగా లాంగ్ లీవ్ పెట్టారు. దాదాపు 15 రోజులు ఆ సెక్షన్ చూసే వారే లేకుండా పోయారు. ఆ తర్వాత మళ్లీ తిరిగి ఇక్కడ ఉద్యోగాల్లో చేరలేదు. అటు నుండి అటే వేరే చోటికి బదిలీ అయ్యారు. అదేంటి అంటే బాస్ అనుకున్న టార్గెట్ రీచ్ కాకపోవడంతో లాంగ్ లీవ్ పై వెళ్లారని, ఇక్కడ భరించలేక బదిలీ చేయించుకున్నట్లు సమాచారం. టీపీఎస్ సెక్షన్ తర్వాత ఇప్పుడు అదే బాటలో ఇంజనీరింగ్ సెక్షన్ లో పలువురు ఏఈలు లాంగ్ లీవ్ లకు, అవసరమైతే బదిలీలకు సిద్ధపడుతున్నారు. రేపోమాపో వారు కూడా శేరిలింగంపల్లి నుంచి వెళ్లిపోనున్నారు. శానిటేషన్ సెక్షన్ లోనూ సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదని ఇక్కడి నుండి ఎంత త్వరగా పోతే అంత మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వీరేగాక మిగతా సెక్షన్లకు చెందిన కిందిస్థాయి సిబ్బంది కూడా వద్దు బాబూ ఇక్కడ పనిచేయలేక పోతున్నాం అంటూ భయపడిపోతున్నారు. అదేంటి అంటే బాస్ టార్గెట్ రీచ్ కాలేకపోతున్నట్లు చెప్పకనే చెబుతున్నారు.
ఆయనకు మాత్రం అందలం..
శేరిలింగంపల్లి సర్కిల్ లో గత 6 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఓ ఉద్యోగికి మాత్రం ఇక్కడ అధిక ప్రాధాన్యత లభిస్తుంది. ఈ మధ్య జరిగిన బదిలీలలో ఆయనకు మూసాపేట్ సర్కిల్ కు బదిలీ అయింది. కానీ ఆ సార్ మాత్రం ఇక్కడి నుండి పోనంటే పోను అంటూ కుర్చీ వదలడం లేదు. దీంతో అటు నుంచి ఇటు బదిలీ అయినా ఉద్యోగి ఛార్జ్ తీసుకునేందుకు పలుమార్లు వచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. పెద్దసార్ కు అతి దగ్గరగా ఉండే అతనికి మాత్రం మరో చోట మంచి బాధ్యతలు అప్పగించి కూర్చోబెట్టారు. అదేంటి అంటే తనను రిలీవ్ చేయలేదని చెబుతూ ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. ఈయనకు మాత్రమే కాదు మరి కొందరు అధికారులు సైతం పెద్దసార్ అండదండలతో తమతమ సెక్షన్లలో హవా చెలాయిస్తున్నారు.
రూల్స్ డోంట్ కేర్..
ఏ ఆఫీసర్ అయినా తమ శాఖ పరిధిలో ఉండే నిబంధనలకు అనుగుణంగా పని చేయాల్సి ఉంటుంది. కానీ ఈ బాస్ కు మాత్రం రూల్స్ పాటించడం, అందులోనే పని చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదట.. రూల్స్ పాటిస్తే తమకు అవసరం లేదని, రూల్స్ ను అతిక్రమించి అవసరం అయినదానికంటే కాస్త ఎక్కువ చేసే వారే తమ వద్ద ఉండాలని ఇంటర్నల్ గా హెచ్చరించారట. ఒకవేళ పెద్ద ఆఫీసర్ చెప్పినవి చేస్తే మున్ముందు తాము ఇక్కట్లు పడటం ఖాయమని ఉద్యోగులు జంకుతున్న పరిస్థితి శేరిలింగంపల్లిలోని జంట సర్కిళ్లలో కనిపిస్తుంది. మున్ముందు ఈ పరిస్థితి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్న ఆందోళనలు జీహెచ్ఎంసీ ఉద్యోగుల్లో వ్యక్తం అవుతుంది.