సుప్రీంలో తెలంగాణ సర్కార్ పిటిషన్.. మరో మార్గం లేకే ఆశ్రయించామన్న సీఎస్

శాసనసభ, శాసనమండలి ఆమోదించిన పది బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలుపకపోవడంతో.... Special Story

Update: 2023-03-03 02:49 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: శాసనసభ, శాసనమండలి ఆమోదించిన పది బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలుపకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతేడాది సెప్టెంబరు 13న అసెంబ్లీ ఉభయ సభల ఆమోదంతో పంపిన ఏడు బిల్లులు, ఈ ఏడాది ఫిబ్రవరి 13న పంపిన మూడు బిల్లులకు గవర్నర్ ఇప్పటివరకు ఆమోదం తెలుపలేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి శాంతికుమారి దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్‌కు విచక్షణాధికారాలు ఉన్నా సకాలంలో స్పందించకపోవడంతో ఆర్టికల్ 32 ప్రకారం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ బిల్లులకు ఆమోదం తెలుపడమో లేక తిరస్కరించడమో లేక రాష్ట్రపతి పరిశీలన కోసం పంపడమో లేక తగిన సవరణలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపడమో చేయాల్సి ఉంటుందని, కానీ గవర్నర్ మాత్రం వాటిపై అధ్యయనం అనే పేరుతో తన దగ్గరే ఉంచుకున్నారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గవర్నర్ వ్యవస్థలో న్యాయస్థానం జోక్యం చేసుకోవచ్చునని, గతంలో అరుణాచల్‌ప్రదేశ్‌లో నబమ్ రెబియా వర్సెస్ డిప్యూటీ స్పీకర్(2016)లో సుప్రీం కోర్టు కొన్ని సూచనలు చేసిందని శాంతికుమారి ఆ పిటిషన్‌లో ప్రస్తావించారు. గవర్నర్‌కు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన విచక్షణాధికారాలకు కొన్ని పరిమితులు ఉంటాయని, ఆర్టికల్ 163(1), (2) పరిధిలోకి లోబడి ఉంటాయని ఆమె గుర్తుచేశారు. అలాంటి పరిమితులు మినహా మిగిలిన సందర్భాల్లో మంత్రివర్గం సలహా మేరకే గవర్నర్ పనిచేయాల్సి ఉంటుందని నొక్కిచెప్పారు. షంషేర్‌సింగ్ వర్సెస్ పంజాబ్(1974) కేసు సందర్భంగా సుప్రీంకోర్టు వెల్లడించిన అభిప్రాయాలను సైతం గుర్తుచేశారు. రాజ్యాంగానికి తుది మెరుగులు దిద్దే సమయంలో కాన్‌స్టిట్యూయెంట్ అసెంబ్లీలో జరిగిన చర్చలను ఉటంకిస్తూ జస్టిస్ కృష్ణయ్యర్ ప్రస్తావించిన అంశాలను శాంతికుమార్ ఉదహరించారు.

శాసనసభ, మండలి ఆమోదించి పంపిన బిల్లుల విషయంలో రాజ్యాంగానికి లోబడి గవర్నర్ నాలుగు రకాలుగా(ఆమోదించడం, తిరస్కరించడం, తిప్పి పంపడం, రాష్ట్రపతి పరిశీలనకు పంపడం) స్పందించాల్సి ఉంటుందని, కానీ ఇందులో దేనికీ చెందకుండా పరిశీలన పేరుతో తన దగ్గరే ఉంచుకుని జాప్యం చేస్తున్నారని, తగినంత సమయం గడిచినా వాటిపై నిర్ణయాన్ని వెలువరించకపోవడం రాజ్యాంగ విధులకు కట్టుబడే వ్యవహరిస్తున్నారా అనే సందేహం తలెత్తుతున్నదని శాంతికుమారి పేర్కొన్నారు. పురుషోత్తమన్ నంబూద్రి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు 1962లో బిల్లులను పెండింగ్‌లో పెట్టడానికి గడువుపై స్పష్టత ఇచ్చిందని గుర్తుచేశారు. 1949 ఆగస్టు 1వ తేదీన రాజ్యాంగంపై కాన్‌‌స్టిట్యూయెంట్ అసెంబ్లీలో జరిగిన చర్చలపై ఎన్జీ రంగా, బ్రజేశ్వర్ ప్రసాద్, కృష్ణమాచారి తదితరులంతా గవర్నర్ విధులపై వెలిబుచ్చిన అంశాలను చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఉటంకించారు.

ప్రభుత్వం పంపిన బిల్లుల్లో కొన్నింటిపై సందేహాలను నివృత్తి చేయాల్సిందిగా గవర్నర్ చేసిన విజ్ఞప్తి మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గతేడాది నవంబరు 10న రాజ్‌‌భవన్‌కు అధికారులతో కలిసి వెళ్లి వివరించారని శాంతికుమారి ఆ పిటిషన్‌లో ప్రస్తావించారు. తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లు, తెలంగాణ స్టేట్ ప్రైవేటు యూనివర్సిటీల స్థాపన బిల్లుపై తగినంత విద్యార్థులకు రిజర్వేషన్లు కల్పించడం సహా పలు వివరణలు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ బిల్లుల ప్రాధాన్యత, ఆలస్యం జరగడంతో ఏర్పడుతున్న ఆటంకం తదితరాలపై శాసన వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి జనవరి 30న రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు వివరించారని, వీలైనంత తొందరగా ఆమోదం తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేశారని గుర్తుచేశారు. తొందర్లోనే ఆ బిల్లులను క్లియర్ చేస్తానంటూ గవర్నర్ హామీ ఇచ్చారని, నెల రోజులు దాటినా ఆ దిశగా కార్యాచరణ లేదని పేర్కొన్నారు. దీర్ఘకాలం బిల్లులకు ఆమోదం తెలపకుండా పెండింగ్‌లో ఉంచడానికి ఎలాంటి సహేతుకమైన కారణం లేదని పేర్కొన్నారు.

బడ్జెట్ సమావేశాల సందర్భంగానూ 2023-24 సంవత్సరాలకు సంబంధించిన ఫైనాన్స్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం అవసరమైనందున సమావేశాల నిర్వహణకు తేదీని ఖరారు చేయడానికి ఆర్థిక శాఖ నుంచి లేఖ వెళ్ళినా ప్రయోజనం లేకపోయిందని, చివరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చిందని చీఫ్ సెక్రెటరీ గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించడం మినహా రాష్ట్ర ప్రభుత్వానికి మరో దారి లేకపోయిందని, గత్యంతరం లేనందువల్లనే ఈ పిటిషన్‌ను దాఖలు చేయాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. ఎలాంటి సమంజసమైన కారణాలు లేకుండా చట్టసభలు ఆమోదించిన బిల్లులను దీర్ఘకాలం పాటు పెండింగ్‌లో ఉంచడం లేదా సైలెంట్‌గా ఉండిపోవడం రాజ్యాంగ విధులుగా పరిగణించలేమని పేర్కొన్నారు.

రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తించడంలో గవర్నర్ వ్యవహరించిన తీరు క్రమరహితమైనదని, చట్టవిరుద్ధమైనదని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న పది బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాల్సిందిగా గవర్నర్‌కు తగిన ఆదేశాలు జారీచేయాలని ఆ పిటిషన్‌లో శాంతికుమారి పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశమున్నది.

గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులు

1. అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా(టెర్మినేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ లీజెస్) సవరణ బిల్లు

2. తెలంగాణ మున్సిపల్ లా సవరణ బిల్లు

3. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయీమెంట్ రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ యాన్యుయేషన్ సవరణ బిల్లు

4. యూనివర్శిటీ ఆఫ్ ఫారెస్టరీ తెలంగాణ బిల్లు

5. తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లు

6. తెలంగాణ మోటారు వాహనాల పన్ను సవరణ బిల్లు

7. తెలంగాణ స్టేట్ ప్రైవేటు యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ అండ్ రెగ్యులేషన్ సవరణ బిల్లు

8. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ సవరణ బిల్లు

9. తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లు

10. తెలంగాణ మున్సిపాలిటీస్ సవరణ బిల్లు

Tags:    

Similar News