కించపరిచే ఉద్దేశం లేదు.. హిజ్రాలకు సారీ చెప్పిన షర్మిల! (Video)

హిజ్రాలకు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల క్షమాపణలు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలపై... Sorry to transgenders, says Sharmila

Update: 2023-02-22 10:17 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హిజ్రాలకు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల క్షమాపణలు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలపై ట్రాన్స్ జెండర్ల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో తన వ్యాఖ్యలపై బుధవారం స్పందించారు. హిజ్రాలను అవమానించాలని వారిని కించపరిచాలనే ఉద్దేశం తనకు లేదని శంకర్ నాయక్ తనపై చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చే క్రమంలో తాను అలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. ఈ సమాజంలో హిజ్రాలు వాళ్లకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నారని, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోని శంకర్ నాయక్ కు మాత్రం కనీసం విలువ, మర్యాద కూడా లేదు అని విమర్శించే క్రమంలోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానన్నారు. తన మాటల వల్ల హిజ్రా అక్కాచెల్లెళ్ల మనోభావాలు దెబ్బతిని ఉంటే బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాన్నారు. హిజ్రాల బాగోగుల గురించి ఆలోచన చేసే దాన్ని తాను అని చెప్పారు.

ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ట్రాన్స్ జెండర్లను ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ఎనిమిదిన్నర ఏళ్లలో సీఎం కేసీఆర్ హిజ్రాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, పించన్లు ఇచ్చారా అని నిలదీశారు. ఈ విషయంలో హిజ్రాలు ఆలోచన చేయాలన్నారు. అదే వైఎస్సార్ టీపీ అధికారంలోకి వస్తే హిజ్రాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. పేద హిజ్రాలకు ఇల్లు ఇస్తామని, పావలా వడ్డీ లేదా సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చి సొంత కాళ్ల మీద నిలబడేలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ముందు బీఆర్ఎస్ శ్రేణులకు పాఠాలు నేర్పండి:

దుండగుల దాడిలో తీవ్ర గాయాల పాలైన కాంగ్రెస్ యూత్ లీడర్ తోట పవన్ ను వైఎస్ షర్మిల పరామర్శించారు. సికింద్రాబాద్ అపోలోలో చికిత్స పొందుతున్న పవన్ ను పరామర్శించి అతడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ పై బీఆర్ఎస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నీతులు చెప్పే కేసీఆర్ ముందుగా తమ పార్టీ నేతలకు ప్రజాస్వామ్య పాఠాలు నేర్పాలని సూచించారు.  

Tags:    

Similar News