త్వరలో ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనాన్ని నిర్మిస్తాం

త్వరలో ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనాన్ని నిర్మిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

Update: 2024-06-21 10:15 GMT

దిశ,కార్వాన్ : త్వరలో ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనాన్ని నిర్మిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రిలో పర్యటించి 16 కోట్ల 68 లక్షల రూపాయలతో పనులకు ప్రారంభోత్సవం చేశారు. 13.97 కోట్ల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎం ఆర్ ఐ స్కాన్ యంత్రం, 2 కోట్ల 16 లక్షల రూపాయలతో అత్యాధునిక కిచెన్, 55 లక్షల రూపాయలతో జనరల్ మెడికల్ బ్లాక్ లో ఓపీ కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే 5 కోట్ల 90 లక్షల రూపాయలతో ఉస్మానియా ఆస్పత్రిలో మార్చరి ఆధునీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ

    మాట్లాడుతూ ఉస్మానియా అంటే హైదరాబాద్ షాన్ అని, అలాంటి ఆసుపత్రిని కాపాడుకోవాలన్నారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఉస్మానియా ఆస్పత్రికి చికిత్స చెయ్యాల్సి ఉందన్నారు. గత పాలకులకు టీమ్స్ ఆసుపత్రుల నిర్మాణంపై ఉన్న శ్రద్ధ ఉస్మానియా ఆసుపత్రి పై లేదన్నారు. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన పై సీఎం రేవంత్ రెడ్డి తో చర్చిస్తామన్నారు. సమస్యలు ఉన్నప్పటికీ ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు, నర్సింగ్, సిబ్బంది మెరుగైన సేవలు అందజేస్తున్నారన్నారు. ఉస్మానియా ఆస్పత్రి లో 1951 లో నిర్మించిన జీఎన్ఎం నర్సింగ్ కాలేజీ హాస్టల్ భవనాన్ని త్వరలో నిర్మిస్తామన్నారు. హెల్త్ ఫాలసీ పై కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు స్పష్టం చేశారు. ప్రైమరీ, సెకండరీ హెల్త్ విభాగాలను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాబోయే తరాలు గుర్తుంచుకునేలా ప్రజా పాలన ఉంటుందని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ లో

    అన్ని రేట్స్ రివైస్ చేసి,హెల్త్ స్కీమ్స్ కి సంబంధించిన గ్యాప్స్ ఎక్కడ ఉన్నా వాటిని ఫుల్ ఫిల్ చేస్తామన్నారు. పేదలకు ప్రమాణాలతో కూడిన విద్య, మెరుగైన వైద్యాన్ని అందించడమే ప్రభుత్వ బాధ్యతగా అడుగులు వేస్తుందన్నారు. గత ప్రభుత్వాలు కొత్త సెక్రటేరియట్ కట్టడం, పెద్ద పెద్ద విగ్రహాలు పై పెట్టిన శ్రద్ధ ఉస్మానియా ఆస్పత్రి పై పెట్టలేదన్నారు. పేద వారికి మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు ప్రభాకర్, వాణిదేవి, స్థానిక శాసనసభ్యులు రాజాసింగ్, స్థానిక కార్పొరేటర్ శంకర్ యాదవ్, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్ వీ కర్ణన్, ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేందర్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఆర్డీవో మైపాల్, ఎమ్మార్వో ప్రేమ్ కుమార్, ఆర్ఎంవోలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


Similar News