ఎస్సీ వర్గీకరణను అడ్డుకునేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారు : మందకృష్ణ మాదిగ

ఎస్సీ వర్గీకరణను అడ్డుకునేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని, ఎవరెన్సీ చేసినా ఆ ఫలాలు అందరికీ అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని, ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అన్నారు

Update: 2024-12-24 15:19 GMT

దిశ, ఖైరతాబాద్ : ఎస్సీ వర్గీకరణను అడ్డుకునేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని, ఎవరెన్సీ చేసినా ఆ ఫలాలు అందరికీ అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని, ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వేదికగా నిర్వహించే 'వెయ్యి గొంతులు... లక్ష డప్పులు' కార్యక్రమానికి మద్దతుగా పలువురు కళాకారులతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మందకృష్ణ మాట్లాడుతూ… గత 30 ఏండ్లుగా కండువా మార్చకుండా వర్గీకరణ ఉద్యమం చేస్తూ వస్తున్నానని, అందులో ఫలితాన్ని దక్కించుకున్నామన్నారు. ప్రస్తుతం ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ మొదట చేస్తామని ప్రకటించినా ఆ పార్టీలోని మాల సామాజికవర్గానికి చెందిన నాయకులు నేటికీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే వర్గీకరణ అంశాన్ని ఓ రాజకీయ పార్టీ వైపు మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. వర్గీకరణ కోసం తాను అన్ని పార్టీలను సంప్రదించాలని, అందరినీ మద్దతు కూడగట్టానన్నారు.

కాంగ్రెస్ పార్టీలో భారతదేశంలో ఎవరికి లేని పలుకుబడి మాలలకు ఉందని, ఆ వర్గమే పార్టీని శాసిస్తోందని, వర్గీకరణను అడ్డుకునే ప్రయత్నాలు చేసే వారు కూడా వారేనని ఆరోపించారు. వర్గీకరణను అడ్డుకునే వారిపై ధర్మ యుద్ధం నిర్వహించేందుకు కళాకారులతో వెయ్యి గొంతకులు, లక్ష డప్పులు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అంతకు ముందు జనవరి 3 నుంచి తెలంగాణ వ్యాప్తంగా రథయాత్రలు నిర్వహిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 3న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద మహా ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న, దండోరా కళామండలి జాతీయ అధ్యక్షులు ఎన్వై అశోక్ మాదిగ, ప్రముఖ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్, ప్రజా వాగ్గేయకారులు దరువు ఎల్లన్న, గిద్దె రాంనర్సయ్య, రామంచ భరత్, ప్రముఖ రచయిత పసునూరి రవీందర వాణి, శైలజ తదితరులు పాల్గొన్నారు.


Similar News