అన్యాయం జరిగితే ఊరుకోం: లగచర్ల ప్రజలకు అండగా ఎస్సీ, ఎస్టీ కమిషన్

ఫార్మా సిటీ కోసం గిరిజన భూములు బలవంతంగా లాక్కోవడం సరైన పద్ధతి కాదని, భూమిని నమ్ముకున్న గిరిజన కుటుంబాలు ఏమైపోవాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు...

Update: 2024-11-16 16:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఫార్మా సిటీ కోసం గిరిజన భూములు బలవంతంగా లాక్కోవడం సరైన పద్ధతి కాదని, భూమిని నమ్ముకున్న గిరిజన కుటుంబాలు ఏమైపోవాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఫార్మా కంపెనీకి కమిషన్ వ్యతిరేకం కాదని, ఏదైనా రాజ్యాంగబద్ధంగా, సామరస్యపూర్వకంగా జరగాలని, ఇలా దాడులు చేయడం సరైన పద్దతి కాదని అన్నారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమా‌ర్‌లతో కలిసి బీర్‌బాగ్‌ ఎస్సీ, ఎస్టీ కార్యాలయంలో లగిచర్ల బాధితులు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భారత రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ దేశంలోని ప్రజలందరికీ స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పించారని, హక్కులను హరించే అధికారం ఎవ్వరికి లేదన్నారు. అధికారులపై జరిగిన దాడులను ఖండిస్తున్నామన్నారు. అన్యాయం జరిగితే ఊరుకోమని హెచ్చరించారు. త్వరలోనే లగచర్ల గ్రామంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటిస్తుందని, వారికి అండగా ఉంటామని చైర్మన్ బక్కి వెంకటయ్య భరోసానిచ్చారు.

గిరిజనుల భూమి మాత్రమే ఉందా:మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అధికార దురంహకారాన్ని గిరిజనులపై చూపిస్తున్నాడని, కలెక్టర్ అధికారులపై దాడి చేశారని అమాయకులైన రైతులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ కోసం గిరిజనుల భూమి మాత్రమే ఉందా అని ప్రశ్నించారు. భూమి పుత్రుల భూములను లాక్కునే ప్రయత్నాలను కాంగ్రెస్ మానుకోవాలన్నారు. వారి కడుపుకాలి తిరగపడితే వారిపై హత్యాయత్నం కేసులు పెట్టారని, రేవంత్ రెడ్డి పరిపాలనకు ఇది పరాకాష్టగా నిలిచిపోతుందన్నారు. ఫార్మా సిటీ ప్రయత్నాన్ని విరమించుకొని, గిరిజనులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ లెగచర్లకు వస్తే కలెక్టర్ అక్కడికి వెళ్తే ఒక్క పోలీస్ అధికారి లేకపోవడం దేనికి సంకేతమన్నారు. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగం అసలు పనిచేస్తుందా అని విమర్శించారు. ముఖ్యమంత్రి ఇప్పటికైన కక్ష రాజకీయాలు మానుకొని పాలన పై దృష్టి పెడితే బాగుంటుందన్నారు.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. దాడులు జరిగింది అధికారుల మీద కాదు గిరిజన ప్రజల మీద అన్నారు. గిరిజన మహిళలపై దాడులు చేసిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసీటీ, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు పెట్టాలని కమిషన్ కోరామని తెలిపారు. గిరిజన ప్రజలకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ న్యాయం చేస్తుందని నమ్ముతున్నామని, సమగ్ర దర్యాప్తు జరిపించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లగచర్ల బాధిత కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు కోవాలక్ష్మి , అనిల్ జాదవ్, పార్టీ నాయకులు జాన్సన్ నాయక్, రూప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.


Similar News