రిధిర వెంచర్ లీలలు..! అనుమతులు లేకుండానే అక్రమ నిర్మాణాలు

డీటీసీపీ, రేరా, ఎల్‌పీ నంబర్లు లేకుండానే రిధిర వెంచర్ ప్లాట్లు విక్రయించమే కాకుండా అనుమతులు లేకుండానే భవన నిర్మాణాలు ప్రారంభించింది.

Update: 2024-10-08 02:17 GMT

దిశ, సంగారెడ్డి/కొండాపూర్: డీటీసీపీ, రేరా, ఎల్‌పీ నంబర్లు లేకుండానే రిధిర వెంచర్ ప్లాట్లు విక్రయించమే కాకుండా అనుమతులు లేకుండానే భవన నిర్మాణాలు ప్రారంభించింది. వెంచర్ ఏర్పాటు చేయాలంటే డీటీసీపీ, రేరా, ఎల్పీ నంబర్ తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, కొండాపూర్ మండలం మహ్మదాపూర్ పరిధిలోని సర్వే నెం.101, 102, 103, 14, 105, 125, 126, 127, 128, 129‌లో రిధిర వెంచర్ అక్రమ బిల్డింగ్ నిర్మాణాలు చేపట్టింది. మొత్తం 90 ఎకరాల్లో వెంచర్ ఏర్పాటు చేసిన రిధిర డీటీసీపీ రెసిడెన్సియల్స్ విల్లా ప్లాట్ కమ్యూనిటీ లే అవుట్ పేరిట ప్రీలాంఛ్ ఆఫర్లను ప్రకటించింది. అదే కాకుండా రంగురంగుల బ్రోచర్లు ముద్రించి కస్టమర్లకు రంగుల ప్రపంచం చూపిస్తున్నారు. ఒకచోట గజాల లెక్కన అమ్ముతూ.. గుంటల లెక్కన రిజిస్ట్రేషన్ చేయిస్తున్నది. మరోచోట మెగా డీటీసీపీ రెసిడెన్షియల్ విల్లా ప్లాట్ కమ్యూనిటీ లేఅవుట్ ప్రీలాంచ్ ఆఫర్లను ప్రకటించి కస్టమర్లను ఆకర్షిస్తున్నది. అయితే, డీటీసీపీ, హెచ్ఎండీఏ పర్మిషన్స్ లేకుండా దందా చేస్తున్నారు. దీనికి రెవెన్యూ, పంచాయతీ అధికారుల అండదండలు పుష్కలంగా అందిస్తున్నారు.

నోటీసులిచ్చినా స్పందించని యాజమాన్యం..

కొండాపూర్ మండలం మహ్మదాపూర్ హైదరాబాద్ నుంచి శంకర్ పల్లి రహదారిపై ఉండడంతో రిధిర వేంచర్ యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండానే వేంచర్ ఏర్పాటు చేసింది. వెంచర్‌లో డీటీసీపీ, హెచ్ఎండీఏ, రేరా అనుమతులు లేకుండానే భవన నిర్మాణాలు చేపట్టింది. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నారని గతంలో ‘దిశ’ దినపత్రిక కథన వెలువరించింది. అందుకు స్పందించిన అధికారులు రిధిర వేంచర్ యాజమాన్యానికి మొదటి నోటీసు ఫిబ్రవరి 7, 2024న జారీ చేశారు. ఆ నోటీసుల్లో గ్రామ పంచాయతీ అనుమతి తీసుకోవాలని లేనిపక్షంలో తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అయినా, కూడా రిధిర వేంచర్ యాజమాన్యం నోటీసులను సైతం లెక్కచేయకుండా నిర్మాణాలు చేపట్టింది. దీనికి తిరిగి పంచాయతీ కార్యదర్శి మే 21న తేదీన సెకెండ్ నోటీసు జారీ చేశారు. ఈ నోటీసులో డీటీసీపీ లేఅవుట్ పైనల్ పర్మీషన్ లేకుండా నిర్మాణ పనులు చేపడుతున్నారని, మొదటి నోటీసుకు కూడా ఎలాంటి రెస్పాండ్ లేనందున మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నోటీసు అందుకున్న మూడు రోజుల్లో ఫర్మీషన్ తీసుకోవాలని లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా కూడా రిధిర వేంచర్ ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే అక్రమ నిర్మాణాలు చేపట్టింది.

అధికారుల తీరు ప్రశ్నార్థకం..

ఎలాంటి అనుమతులు లేకుండానే విల్లాలు, భవన నిర్మాణాలు చేపట్టిన కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వెంచర్ యాజమాన్యానికి నోటీసులతోనే సరిపెట్టారు. కానీ, చర్యలు శూన్యం. సెకెండ్ నోటీసు జారీ చేసిన సందర్భంగా మూడు రోజుల్లో పర్మీషన్ తీసుకోవాలని హెచ్చరించి వదిలేశారు. నోటీసు ఇచ్చి ఐదు నెలలు దాటిపోయింది. కానీ పంచాయతీ అధికారుల్లో చలనం లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. కొండాపూర్ మండలం మహ్మదాపూర్ గ్రామంలో రుధిర వేంచర్ ఎలాంటి అనుమతులు లేకుండా విల్లాలు, భవన నిర్మాణాలు చేపడుతున్న అటువైపు అధికారులు కన్నెత్తి చూడడం లేదు. నోటీసులు ఎప్పుడు ఇచ్చారు.. ఏ తేదీల్లో ఇచ్చారు అనే వివరాలు అడిగితే వేంచర్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చామంటూ నోటీసులు జారీ చేసిన తేదీ కనిపించకుండా ఓ స్కేట్ అడ్డుపెట్టి వాట్సాప్‌లో ఫోటో పంపించారు. నోటీసులు జారీ చేసిన తేదీలను సైతం గ్రామ కార్యదర్శి చెప్పేందుకు కూడా సిద్దంగా లేకపోవడం పట్ల పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వేంచర్ యాజమాన్యంతో కుమ్మక్కు కావడం వల్లే అక్రమ నిర్మాణాలు చేపడుతున్న రిధిర వేంచర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

అనుమతులు లేకుండానే 90 ఎకరాల్లో వెంచర్

కొండాపూర్ మండలం మహమ్మదాపూర్‌లో రిధిర వేంచర్ అనే కంపెనీ 90 ఎకరాల్లో మెగా డీటీసీపీ రెసిడెన్షియల్ విల్లా ప్లాట్ కమ్యూనిటీ లే‌అవుట్ పేరిట ఫ్రీ‌లాంఛ్ ఆఫర్లను ప్రకటించింది. ఇందులో పెట్టుబడి పెడితే లాభాల పంట పండుతుందంటూ బ్రోచర్లు ముద్రించి ప్రచారం చేస్తున్నారు. రూ.1.70 కోట్లు పెట్టుబడి పెడితే ఎకరం రిజిస్ట్రేషన్ చేస్తారు. డెవలప్ చేసిన తర్వాత కస్టమర్ షేర్ కింద 1800 గజాలు ఇస్తారు. రూ.85 లక్షలు పెట్టుబడి పెడితే అరెకరం ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తారు. డెవలప్ చేసిన తర్వాత 900 గజాల ప్లాట్ ఇస్తారు. రూ.45 లక్షలకు 10 గుంటలు, డెవలప్ చేసిన తర్వాత 500 గజాలు, రూ.25 లక్షలు చెల్లిస్తే 5 గుంటల భూమి వెవలప్ చేసిన 250 గజాల ప్లాట్ ఇస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే, కస్టమర్ల నుంచి డబ్బులు ముందుగానే తీసుకుని భూమిని కొనుగోలు చేశారు.

ఈ భూమికి సంబంధించి డీటీసీపీ పర్మీషన్ రాగానే లే అవుట్ చేసిన ప్లాట్లు ఇస్తామని ప్రకటించారు. ఏడాదిలో పెట్టిన పెట్టుబడిలో 80 శాతం రిటర్న్ వస్తుందని హామీ ఇస్తున్నారు. 5, 10, 20, 40 గుంటల్లో పెట్టుబడి పెట్టడం స్మార్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫర్ ఏ స్మార్ట్ ఫ్యూచర్ అనే నినాదాన్ని కస్టమర్లకు వినిపిస్తున్నారు. ఏదైనా వివాదాలు తలెత్తి డీటీసీపీ అనుమతులు రాక‌పోతే పెట్టిన పెట్టుబడులు తిరిగి ఎలా వస్తాయన్నది కస్టమర్లు ఆలోచించాలి. అయినా, అంత పెద్ద కంపెనీ కస్టమర్ల డబ్బులతోనే ల్యాండ్ డెవలప్ చేసే బదులుగా సొంతంగా ఎందుకు చేయకూడదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంకా రిధిర వెంచర్‌కు ఎలాంటి అనుమతులు రాలేదు. కొనుగోలుదారులు ఎటువంటి అనుమతులు లేని ఇలాంటి ప్లాట్లు కొని భవిష్యత్తులో అవసరానికి అమ్ముకోలేరు, సరికదా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.


Similar News