నీలోఫర్ శిశువు కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు...

సొంత అక్కకు ముగ్గురు ఆడపిల్లల సంతానం కావడంతో మగ పిల్లవాని కోసం పథకం ప్రకారం నీలోఫర్ ఆసుపత్రిలో శిశువును కిడ్నాప్ చేసిన సంఘటనలో నాంపల్లి పోలీసులు కొన్ని గంటల వ్యవధిలో ఛేదించి

Update: 2024-11-24 15:28 GMT

దిశ, కార్వాన్ : సొంత అక్కకు ముగ్గురు ఆడపిల్లల సంతానం కావడంతో మగ పిల్లవాని కోసం పథకం ప్రకారం నీలోఫర్ ఆసుపత్రిలో శిశువును కిడ్నాప్ చేసిన సంఘటనలో నాంపల్లి పోలీసులు కొన్ని గంటల వ్యవధిలో ఛేదించి, ముగ్గురిని రిమాండ్ కు తరలించారు. సెంట్రల్ జోన్ సైఫాబాద్ ఏసీపీ సంజయ్ కుమార్ ఆదివారం రాత్రి వివరాలను వెల్లడించారు. జహీరాబాద్ ప్రాంతానికి చెందిన హసీనా బేగం గఫర్ దంపతులకు గత నెల 25వ తేదీన బాబు జన్మించాడు. అయితే జాండీస్ ట్రీట్మెంట్ కోసం నగరంలోని నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స అనంతరం శనివారం మధ్యాహ్నం శిశువును నీలోఫర్ ఆసుపత్రి వైద్యులు డిశ్చార్జి చేశారు. కాగా హసీనా బేగం తో పాటు తన తల్లి ఇంటికి వెళ్లేందుకు సిద్ధం కాగా ఓ గుర్తు తెలియని మహిళ బుర్కా వేసుకొని పరిచయమై బాబును ఎత్తుకొని కొంతసేపు మాట్లాడింది. ఈ క్రమంలో హసీనా బేగం మందులు తీసుకుంటున్న క్రమంలో గుర్తుతెలియని మహిళ బాబును తీసుకొని పరారైంది. వెంటనే స్థానిక పోలీసులకు హసీనా బేగం ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి సీసీ కెమెరా ఫుటేజ్ ల ద్వారా మహిళను గుర్తించారు.

ఇదిలా ఉండగా... అనంతపురం జిల్లా ముడిగుంబ గ్రామానికి చెందిన అబ్దుల్లా అలియాస్ వెంకటేష్ 2009లో రేష్మ అలియాస్ రేణుక ను పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఈ దంపతులకు ముగ్గురు బాలికలు జన్మించారు. ప్రస్తుతం రేష్మ అలియాస్ రేణుక ఎనిమిది నెలల గర్భవతి. ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు కావడంతో అబ్దుల్లా మరదలు షాహినీ బేగం (28)తన అక్కకు మగపిల్లవాడు కావాలని పథకం ప్రకారం నీలోఫర్ ఆసుపత్రిలో బాబును కిడ్నాప్ చేసేందుకు పథకం చేశారు. వీరు ముగ్గురు ప్రస్తుతం పోచమ్మ బస్తి ఇందిరానగర్ లో ఉంటున్నారు. అయితే అబ్దుల్లా మరదలు శనివారం మధ్యాహ్నం ఆసుపత్రికి వెళ్లి డిశ్చార్జ్ అవుతున్న మగ పిల్లవానిని చూసి కిడ్నాప్ చేసేందుకు పన్నాగం చేసింది.

ఈ క్రమంలో హసీనా బేగం గఫర్ దంపతుల నెల రోజుల వయస్సు గల మగ శిశువు సక్లేమ్ చూసి షాహిని ఆస్పత్రిలో ఎత్తుకొని ఆటో ఎక్కి పరారైంది. మాసబ్ ట్యాంక్ జేఎన్ఎఫ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆటో దిగి అక్కడే ఉన్న తన బావ టీవీఎస్ ఎక్సెల్ బండి పైన ఇంటికి వెళ్లి, ఓమ్ని కార్లు అనంతపురం కు బయలుదేరి వెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా టీవీఎస్ ఎక్సెల్ బండిని నెంబర్ గుర్తించి అడ్రస్ తో పాటు ఫోన్ నెంబర్ తెలుసుకున్నారు. వెంటనే సెంట్రల్ జోన్ డిసిపి ఆకాంక్ష యాదవ్ ఆదేశాల మేరకు ఫోన్ నెంబర్ ఆధారంగా జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవల్లి పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు.

వెంటనే అక్కడి పోలీసులు పుల్లూరు టోల్ ప్లాజా వద్ద ఓమ్ని వ్యాన్ ను తనిఖీ చేయగా శిశువు తో పాటు షాహినీ బేగం అబ్దుల్లా రేష్మ ముగ్గురు పోలీసులకు దొరికిపోయారు. వెంటనే నాంపల్లి పోలీసులు ఉండవల్లి పీఎస్ కు వెళ్లి శిశువు తోపాటు నిందితులను కూడా పట్టుకొని వచ్చారు. ఆదివారం రాత్రి ఏసిపి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నాంపల్లి పోలీసులు శిశువును తల్లిదండ్రులకు అప్పజెప్పారు. కిడ్నాప్ పాల్పడిన షహీన్ బేగం, అబ్దుల్లా, రేష్మ లను ముగ్గురిని రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. కొన్ని గంటల వ్యవధిలోనే సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా శిశువును పట్టుకున్న నాంపల్లి ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, సైఫాబాద్ డిఐ సైదేశ్వర్ తో పాటు పోలీస్ సిబ్బందిని ఏసీబీ అభినందించారు.


Similar News