ట్రాఫిక్ విభాగంలో చిచ్చు పెడుతున్న పైలెట్ డ్యూటీలు..

గ్రేటర్ హైదరాబాద్ లోని ట్రై పోలీసు కమిషనరేట్ లోని

Update: 2024-09-24 16:10 GMT

దిశ, సిటీ క్రైమ్: గ్రేటర్ హైదరాబాద్ లోని ట్రై పోలీసు కమిషనరేట్ లోని ట్రాఫిక్ విభాగంలో పైలెట్ డ్యూటీ విధుల పై సిబ్బందిలో కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ పైలెట్ డ్యూటీ అంటేనే అక్రమ వసూళ్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ అంటూ ట్రాఫిక్ పోలీసు వర్గాల్లోనే చర్చ నడుస్తోంది. ట్రాఫిక్ విధుల నిర్వహణలో అందరూ నిజాయితీగా పని చేయాలని చెప్పే అధికారులే వారికి నచ్చిన కానిస్టేబుల్ ను పైలట్ గా పెట్టుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. గతంలో శాంతి భద్రతల పోలీసు స్టేషన్ లను నిర్వహించే అధికారులు వారికి నచ్చిన వారిని రోడ్డు మాస్టర్ గా పెట్టుకుని అక్రమ వసూళ్లకు పాల్పడే వారని గతంలో అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ట్రాఫిక్ లో పైలట్ అంటూ నమ్మిన బంటును పెట్టుకుని కొందరు వసూళ్ళకు పాల్పుడుతున్నారనే టాపిక్ పై విభాగంలోని సిబ్బంది , అధికారులే బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు.

పైలట్ అంటే...

ట్రాఫిక్ పోలీసు వర్గాల ప్రకారం...ఇది ట్రాఫిక్ విభాగంలో పని చేసే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది అనధికారికంగా చలామణిలో ఉన్న పోస్ట్. ట్రాఫిక్ విభాగంలోని ఏసీపీ, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు వారికి సన్నిహితంగా ఉన్న వారిని పైలట్ గా నియమించుకుంటారు. వారి ద్వారా సంబంధిత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిని రూట్ చేసుకుంటారు. నో ఎంట్రీ సమయంలో భారీ వాహనాలకు అనుమతించాలన్నా, లేదా పేరొందిన సూపర్ మార్కెట్, కన్స్ట్రక్షన్, ఫార్మా ఇంకా ఇతర పేరొందిన కంపెనీల వాహనాల మూవ్ మెంట్ కు సమయం నిబంధనల పేరుతో చలానా లు వేయకుండా, రెడీ మిక్స్ వాహనాల రాకపోకలు, ఇంకా ఇతర ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల పై చూసి చూడనట్లు ఉండడానికి, సరైన పార్కింగ్ లేని వాణిజ్య సముదాయాల వద్ద ఇలా అనేక వాటిలో పైలెట్ లు ముందు ఉంటారు. ఈ పైలెట్ తో మ్యాటర్ సెటిల్ చేసుకుంటే ఇక ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎన్ని జరిగినా నో ప్రాబ్లెమ్ అన్ని సాఫీగా సాగిపోతుంటాయి. పైలెట్ ఒకే అంటే సంబంధిత ట్రాఫిక్ అధికారి సై అనట్లేనని ట్రాఫిక్ పోలీసు వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు పైలట్ డ్యూటీలకు అధికంగా ఏఆర్ కానిస్టేబుల్ లను పెట్టుకోవడంతో వారి దూకుడు వ్యవహారంతో మిగతా సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలా ట్రాఫిక్ విభాగంలో ఏఆర్ , సివిల్ పోలీసుల మధ్య ఈ పైలట్ వ్యవహారం విబేధాలకు దారి తీస్తుందని ట్రాఫిక్ వర్గాలు చెబుతున్నాయి.

అధికంగా సైబరాబాద్ , రాచకొండ , హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పైలట్ ల వసూళ్లు నెలకురూ.50 వేల నుంచి 4 లక్షల వరకు ఉంటుందని ట్రాఫిక్ పోలీసు వర్గాలే ఆరోపిస్తున్నాయి. ఒకసారి పైలెట్ తో డీల్ ఒకే అయ్యిందంటే చాలు శివారు ప్రాంతాల్లో రెడీ మిక్స్, ఇసుక లారీలు, భారీ వాహనాలు, ప్రైవేట్ బస్సులు , వాణిజ్య సముదాయాలకు సంబంధించిన భారీ వాహనాలు నో ఎంట్రీ సమయంలో కూడా ఎంట్రీ లు ఇస్తూ బ్రేక్ లేకుండా ప్రయాణిస్తుంటాయని సమాచారం. ఉన్నతాధికారులు ఈ పైలట్ వ్యవస్థ పై ఆరా తీసి చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల కాలంలో మూడు పోలీసు కమిషనరేట్ పరిధిలో కొత్తగా ఇతర విభాగాల నుంచి వచ్చిన కానిస్టేబుళ్ళు, అధికారులు వారి విధుల్లో భాగంగా చాలా చోట్ల నో ఎంట్రీ సమయంలో భారీ వాహనాలను ఎంట్రీ ఇచ్చినప్పుడు వారి పత్రాలను తనిఖీ చేసే సమయంలో వారు సార్ ....సార్ ....మేము ఫలానా అధికారి పైలట్ కలిశామని చెప్పడంతో నో చలాన్, నో కేసు...ఓన్లీ సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని పలువురు ట్రాఫిక్ అధికారులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Similar News