వర్షాలతో ప్రజలు హడల్​

గ్రేటర్ హైదరాబాద్ లో మబ్బులు కనబడితే ప్రజలు వణుకుతున్నారు.

Update: 2024-08-13 12:45 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో మబ్బులు కనబడితే ప్రజలు వణుకుతున్నారు. గతంలో ముంపు ప్రాంతాల ప్రజలు మాత్రమే ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు నగర వ్యాప్తంగా వరద నీటి సమస్య, డ్రైనేజీ లీకై రోడ్లపై పారడం సర్వ సాధారణమైంది. అనేక ప్రాంతాలలో చినుకు పడితే చాలు వరద నీరు ముంచెత్తుతోంది. చిన్నపాటి వర్షాలకే రోడ్లు, కాలువలు, చెరువులను తలపిస్తున్నాయి. బస్తీలలో ఇండ్లు నీట మునుగుతున్నాయి. నిలిపి ఉంచిన వాహనాలు కొట్టుకుపోతున్నాయి. దీనికి కారణం ఏమిటనేది అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినబడుతున్నాయి.

    గ్రేటర్ పరిధిలోని చాలా ప్రాంతాలలో నిజాం కాలంలో నాటి జనాభా అవసరాల మేరకు నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థనే కొనసాగుతున్నాయి. నిజాం కాలంతో పోలిస్తే ఎన్నోరెట్లు జనాభా పెరిగినా నాటి డ్రైనేజీ వ్యవస్థలే దిక్కయ్యాయి. భారీ వర్షాలు కురిసిన సమయంలో ప్రజలు పడుతున్న ముంపు ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయంపై దృష్టి సారించడం లేదని గ్రేటర్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు నగరం చుట్టూ ఉన్న చెరువులు, కుంటలు క్రమక్రమంగా కబ్జాలకు గురి కావ‌డ‌మే. ఆక్రమణల గురించి తెలిసినప్పటికీ ఉన్నత స్థాయి నుండి వస్తున్న ఒత్తిళ్ల కారణంగా అధికారులు చేష్ట‌లుడిగి చూస్తున్నారు. రాజ‌కీయ ఒత్తిళ్ల‌కు త‌లొగ్గుతూ ఒక‌డుగు ముందుకు వేస్తే పదడుగులు వెనక్కు తగ్గుతున్నారు. వీట‌న్నింటిపై దృష్టి సారించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు పట్టించుకోకపోవడంతో కబ్జాదారుల పాలిట వరంగా మారగా ప్రజల పాలిట శాపంగా పరిణమించింది.

ఏరులై పారుతున్న మురుగు...?

జీహెచ్ఎంసీ పరిధిలోని కాలనీలు, బస్తీలు , ప్రధాన రోడ్లపై మురుగు పారడం సర్వసాధారణమైంది. కొన్ని చోట్ల ప్రజల అవసరాల మేరకు డ్రైనేజీ పైపులు లేకుండా పోవడంతో నిత్యం లీకేజీలు ఏర్పడుతోంది. మరమ్మతులు చేసిన గంటల వ్యవధిలోనే తిరిగి సమస్య ఉత్పన్నమౌతోంది. దీంతో రోడ్డుపై నడిచి వెళ్లలేని విధంగా పరిస్థితులు మారుతున్నాయి. వాహనాలు అందులో నుండి ప్రయాణిస్తున్న సమయంలో పాదచారులపై మురుగు పడుతోంది.

     సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్యకు శాశ్వత పరిషస్కారం చూపడం లేదు. నగరంలో వరద కష్టాలను తొలగించేందుకు నాలాల విస్తరణ, సమగ్ర అభివృద్ధికి గతంలో జీహెచ్‌ఎంసీ ప్రణాళిక రూపొందించింది. అవసరమైతే కొత్త చట్టం తీసుకువస్తాం, దశాబ్దాలుగా నాలాలు కుచించుకుపోయాయి, వాటన్నింటిని పునరుద్దరిస్తామని, నాలాల కబ్జాలను సహించేది లేదు అని ప్రభుత్వాలు ప్రకటించినా ఆచరణలో సాధ్యం కావడం లేదు. ప్రభుత్వాలు మారిన సమయంలో అంతకుముందు పాలకులు ఇచ్చిన హామీలను కొత్త ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో షరా మామూలుగా సమస్యలు పునరావృతం అవుతున్నాయి .

ప్రపంచస్థాయి నగరంలో ఇలాగేనా...?

నగరాన్ని వరదలు ముంచెత్తిన వెంటనే ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషిచేస్తున్నామని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకు వెళుతున్నామని, ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తామని, నాలాలను అక్రమిస్తూ సాగే నిర్మాణాలను ఉపేక్షించేదే లేదని బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కేటీఆర్ ప్రకటించారు. నాలాలపై ప్రత్యేకంగా నజర్ పెట్టాం , వర్షాకాలం వచ్చిందంటే కాలనీలు,

     లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికావడానికి నాలాల కబ్జాలే కారణమంటూ అధికారులు రివ్యూ మీటింగుల్లో కిందిస్థాయి సబ్బందిని కడిగి పారేసే అధికారులు కూడా సమస్యలపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదనేది ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలు మండిపడుతున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అంత‌ర్జాతీయ స్థాయిలో హైద‌రాబాద్ న‌గ‌రాన్ని తీర్చి దిద్దేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, మూసీ బ్యూటిఫికేషన్ చేస్తామని ప్రకటన చేయడం అందరి దృష్టిని అటువైపు మళ్లిస్తోంది

చెరువులు , కుంటలలో బహుళ అంతస్థుల భవనాలు...

ఒకప్పుడు హైదరాబాద్ నగరం చుట్టూ వందలాది చెరువులు, కుంటలు ఉండేవి. ఇవన్నీ ఆక్రమణలకు గురౌతుండడంతో కనుమరుగు అవుతూ వస్తున్నాయి. చెరువులు, కుంటల్లో బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. అక్రమ నిర్మాణ దారులు నాలాలను సైతం వదలడం లేదు. నాలాల స్థలాలను అక్రమించడమే కాకుండా చాలాచోట్ల వాటిపైనే నిర్మాణాలు చేపట్టారు. కొన్నిచోట్ల నాలాలకు అడ్డుగా నిర్మాణాలు చేపట్టడంతో మురుగునీరు, వర్షపు నీరు వెళ్లకుండా రోడ్లను

    ముంచెత్తుతున్నాయి. నాలాలపై అక్రమ నిర్మాణాలు సాగితున్నా జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు చేష్టలుడిగి పోవడంతో నగరంలో చిన్నపాటి వర్షాలకు కూడా వరద నీరు, మురుగునీరు రోడ్లపై చేరి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఆక్రమణ దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా నిజాం కాలంలో ఏర్పాటు చేసిన డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించడంతో పాటు ఇప్పటి జనాభా అవసరాల మేరకు డ్రైనేజీలను నిర్మించి వర్షాలు కురిసిన సమయంలో ప్రజల అవస్థలను తొలగించాలని కోరుతున్నారు. 

Tags:    

Similar News