ఓ వైపు అనుమతులు.. మరోవైపు నోటీసులు..

Update: 2024-08-10 03:13 GMT

దిశ, అబ్దుల్లాపూర్మెట్ : డబ్బుల కోసమో, ప్రజాప్రతినిధులు సలహాల మేరకో కానీ అనుమతులు ఇచ్చిన ఇంటికి పనులు నిలిపివేయాలని అధికారులు నోటీసులు ఇస్తున్నారు. ప్రజాప్రతినిధుల పేరుతో అనుమతులు ఇచ్చినా సరే.. పనులు నిలిపివేయాలని నోటీసులు పంపడం పెద్ద అంబర్పేట మున్సిపల్ అధికారులకు పరిపాటిగా మారింది. పనులు నిలిపివేయాలని అనుకునే ముందు ఎందుకు అనుమతులు ఇచ్చామో కూడా తెలుసుకోకుండా అధికారులు చేసిన వ్యవహారానికి హైకోర్టు సైతం మొట్టికాయలు వేస్తున్నా అధికారుల్లో చలనం కనిపించడం లేదు. పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ కుంట్లూరు పరిధిలో ఉన్న ఓ వార్డులో ఇంటిని నిర్మించుకునేందుకు యజమాని తమ పత్రాలన్నీ చూపెట్టి పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ నుంచి అనుమతులు తీసుకున్నారు. అనుమతులు తీసుకునే ముందే సంబంధిత అధికారులు పూర్తిగా పరిశీలించిన తర్వాతే అనుమతులిచ్చారు.

ఇంతవరకు బాగానే ఉన్నా అనుమతులు వచ్చాయన్న భావనతో సదరు యజమాని ఇంటి పనులను చేపట్టారు. స్థానికంగా ఉన్న ఒక ప్రజా ప్రతినిధి సదరు స్థలానికి ఇంటి అనుమతులు ఎందుకు ఇచ్చారు..? ఇచ్చినా సరే చేపట్టిన పనులు నిలిపివేయాలని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారని సమాచారం. తట్టుకోలేక మున్సిపల్ అధికారులు ఇంటి అనుమతికి ఇచ్చిన యజమానికే పనులు నిలిపివేయాలని నోటీస్ ఇవ్వడం గమనార్హం. నోటీసులు తీసుకున్న వ్యక్తి కోర్టుకు వెళ్లడం, కోర్టు సైతం కమిషనర్ పై మొట్టికాయలు వేయడం కూడా జరిగిపోయింది. హైకోర్టు మొట్టికాయలు వేసినా అధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడం విడ్డూరం. వీటన్నింటికీ ఓవైపు కాసులు లాగవచ్చనే ఆలోచన కాగా, మరోవైపు సదరు ప్రజాప్రతినిధులు చేస్తున్న ఒత్తిడి కారణంగా తాము నోటీసులు ఇచ్చామని అధికారులు చెప్పడం విడ్డూరంగా మారిందని బహిరంగంగానే ప్రజలు విమర్శలు చేస్తున్నారు. తట్టి అన్నారం పరిధిలోని ఓ వార్డులో గతంలో ఓ ఇంటికి జీ ప్లస్ వన్ అనుమతి తీసుకున్నాడు. అప్పట్లో ఆర్థిక స్తోమత సరిగా లేనందున సదరు యజమాని గ్రౌండ్ ఫ్లోర్ వరకే వేసుకొని పైన నిర్మించుకోవడం నిలిపివేశాడు. పై ఫ్లోర్ వేసుకునేందుకు ఇప్పుడు ప్రయత్నం చేసి లోన్ కోసం బ్యాంకులో అధికారులను కలవగా.. ఇంటికి తీసుకున్న అనుమతులు డేటు దాటిపోయాయి అని, తిరిగి అనుమతులు తీసుకోవాలని సూచించడంతో మున్సిపల్ అధికారులను కలిశారు. సదరు పత్రాలను చూసిన మున్సిపల్ సిబ్బంది పర్మిషన్ ఇవ్వకుండా ముందుగా నిర్మించిన గ్రౌండ్ ఫ్లోర్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఏళ్ల క్రితం చేపట్టిన నిర్మాణానికి వంకలు పెడుతూ ఇవ్వాల్సిన అనుమతులు ఇవ్వకుండా చెప్పులు అరిగేలా సదర యజమానిని ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే మున్సిపాలిటీలో అనేకంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ చిన్నచిన్న రూములు వేసుకునే వారిపై అధికారులు చూపిస్తున్న ప్రతాపం ఎవరికోసమో, ఎందుకోసమో అని ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు. ఇప్పటికైనా సదరు అధికారులు పేదవారిపై ప్రతాపం చూపకుండా బడా వ్యాపారాలు చేసే వారిపై సరైన విధంగా నిర్ణయాలు తీసుకుంటే మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందన్న భావనతో స్థానిక ప్రజలు ఉన్నారు.

Tags:    

Similar News