వివాదాస్పదంగా ఉస్మానియా దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ వైఖరి

పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే మరోవైపు కొంత మంది ఉన్నతాధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది.

Update: 2024-07-06 03:08 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో : పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే మరోవైపు కొంత మంది ఉన్నతాధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. మేం చెప్పిందే వేదం, ఎవరి బాధలు మాకు పట్టవు అనేలా అధికారులు వ్యవహరిస్తున్నారు. అఫ్జల్‌గంజ్‌లో రాష్ట్రంలోనే ఎంతో పేరున్న ఉస్మానియా దంతవైద్య కళాశాల ఉంది. ఇక్కడికి గ్రేటర్ పరిధి నుంచే కాకుండా జిల్లాల నుంచి కూడా ప్రతినిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. వీరికి మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ప్రిన్సిపాల్ కళాశాలలో ఉన్న వసతులు కూడా వారికి దూరం చేస్తున్నారని, చివరకు హాస్పిటల్‌లో పనిచేసే వైద్యులు, సిబ్బంది పట్ల కూడా ఆమె నిరంకుశంగా ఉండడంతో ఆమెపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆమెను వెంటనే విధుల నుంచి తప్పించాలని ఆల్ ఇండియా డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మతిస్థిమితం కోల్పోయినట్లుగా ప్రవర్తిస్తున్న డాక్టర్ అరుణను వెంటనే విధుల నుంచి తప్పించాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం కూడా ఫిర్యాదు చేసింది.

ఆది నుంచి వివాదాస్పదమే..?

ఉస్మానియా దంతకళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ పీ.అరుణ పనితీరు ఆది నుంచి వివాదాస్పదమే. గతంలో 2014లో విజయవాడలో ఆమె పనిచేసిన సమయంలో కూడా ఆమెపై పలు ఫిర్యాదులు వచ్చాయి. అనంతరం ఆమె ఉస్మానియా డెంటల్ కాలేజీకి బదిలీపై వచ్చిన 2021 నుంచి కూడా పరిస్థితులలో మార్పు రాలేదు. రోగులు, వైద్యులు, సిబ్బంది పట్ల ఆమె వ్యవహరిస్తున్న తీరు, వేదింపులను భరించలేక విసుగుచెందిన కొంతమంది వైద్య విద్యార్థులు, సిబ్బంది హైకోర్టును, హెచ్ఆర్సీ, రాష్ట్ర గవర్నర్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డీఎంఈలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీసీఐ) వెబ్‌సైట్‌కు 22 మంది విద్యార్థుల వివరాలు అప్‌లోడ్ చేయాల్సి ఉండగా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో డీసీఐ ఆమెపై చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శికి లేఖ రాసింది. అంతేకాకుండా కాలేజీలో పనిచేస్తున్న వారికి మెడికల్ లీవ్‌లు శాంక్షన్ చేయకపోవడం, ఉద్ధేశ్యపూర్వకంగా వేతనాలు ఆపుతున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. పరీక్షలు రాసే సమయంలో సుమారు 500 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ కేవలం ఒక్క బయోమెట్రిక్ మిషన్ మాత్రమే ఏర్పాటు చేయడంతో విద్యార్థులు పరీక్ష రాసే విలువైన సమయం కోల్పోతున్నారు.

అటెండెన్స్ ఉన్నా..?

ఉస్మానియా డెంటల్ కాలేజీలో చదువుతున్న దంతవైద్య విద్యార్థుల పట్ల ఆమె కర్కశంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. కాలేజీలో చదివే విద్యార్థులకు అవసరమైన అటెండెన్స్ ఉన్నా వారికి అటెండెన్స్ తక్కువగా ఉందని పరీక్షలకు అనుమతించకపోవడంతో కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న వైద్య విద్యార్థిని న్యాయస్థానం నుంచి అనుమతి తెచ్చుకుని పరీక్షలకు హాజరయ్యారు. బీడీఎస్ రెండవ సంవత్సరం చదువుతున్న మరో 22 మంది విద్యార్థినులను కక్షపూరిత ధోరణిలో అటెండెన్స్ ఉన్నా లేదని డిటెండ్ చేయడం వివాదాస్పదమైంది. దీంతో వారు డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారుల అనుమతితో పరీక్షలు రాశారు. 50 సంవత్సరాల వయస్సు ఉన్న ఓ మహిళా నాన్ టీచింగ్ ఉద్యోగిని తొలగించడంతో పాటు మరో నలుగురిని అకారణంగా సస్పెండ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికితోడు వైద్య విద్యార్థులు, వైద్యులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది తమకు ఎదురౌతున్న ఇబ్బందులు ఆమెతో చెప్పుకుందామన్నా సమయం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఆమె మానసికస్థితి సరిగ్గా లేదని వారు ఆరోపిస్తున్నారు.

సంవత్సర కాలంగా లిఫ్ట్ బంద్..

ఉస్మానియా దంత కళాశాలలో పైఅంతస్థులకు వెళ్లేందుకు ఉన్న లిఫ్ట్‌లను సుమారు సంవత్సర కాలంగా మూసి ఉంచారు. అవి పనిచేస్తూ కండీషన్‌లో ఉన్నప్పటికీ లిఫ్ట్ పనిచేయడం లేదని నోటీస్ గోడకు అంటించారు. దీంతో చికిత్సలకు వచ్చే దివ్యాంగ రోగులు మెట్లపై పాకుతూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా కాలేజీలో చదివే విద్యార్థులు నాల్గవ అంతస్థులో పరీక్ష రాయాల్సి ఉంటుంది. హాస్పిటల్స్, కాలేజీల మెయింటెనెన్స్‌లకు ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్నప్పటికీ ఖర్చు తగ్గించాలనే కారణంతో ఏడాది కాలంగా లిఫ్ట్‌ను మూసి ఉంచినట్లు ఆమె అధికారులకు సమాధానం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అనునిత్యం ఇలా అందరినీ ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రిన్సిపాల్ అరుణపై చర్యలు తీసుకోవాలని, ఆమెను విధుల నుంచి తప్పించి ఇతర ప్రిన్సిపాల్‌ను నియమించాలని దంత వైద్య విద్యార్థులతో పాటు అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.


Similar News