ముగిసిన వన్ టీం వన్ డ్రీమ్ 4వ సీనియర్ హాకీ కార్నివాల్

సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ క్లబ్ లో రెండు రోజులుగా కొనసాగుతున్న వన్ టీం వన్ డ్రీమ్ 4వ సీనియర్ హాకీ కార్నివాల్ ఆదివారం ముగిసింది.

Update: 2022-12-11 14:38 GMT

దిశ, మెట్టుగూడ: సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ క్లబ్ లో రెండు రోజులుగా కొనసాగుతున్న వన్ టీం వన్ డ్రీమ్ 4వ సీనియర్ హాకీ కార్నివాల్ ఆదివారం ముగిసింది. ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ టేలిచేరి స్పోర్ట్స్ క్లబ్(ఒమాన్) జట్లు తలపడగా యునైటెడ్ టేలిచేరి జట్టు 4-1 గోల్స్ తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జట్టుపై విజయం సాధించింది. ఈ ఫైనల్ మ్యాచ్ కు ముఖ్య అతిథులుగా 1975 వరల్డ్ కప్ విజేత భారత టీం మాజీ కెప్టెన్ అజిత్ పాల్ సింగ్ , దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ ప్రెసిడెంట్ జెక్. జైన్, ప్రధాన కార్యదర్శి ఏకే సింగ్ హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకొని ఉత్సాహపరిచారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా అజిత్పాల్ సింగ్ మాట్లాడుతూ హాకీ క్రీడలో భారత్ 8 బంగారు పతకాలు సాధించిందని, 1928 ఒలింపింక్స్ నుంచి భారత్ హాకీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ వచ్చిందన్నారు. భారత హాకీ జట్టు చివరిసారిగా 1980లో స్వర్ణం సాధించిందన్నారు. రాబోయే రోజుల్లో భారత హాకీ జట్టు అద్భుతమైన విజయాలను సాధిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. ఆర్గనైజింగ్ చైర్మన్ రోషన్ జీత్ సింగ్ మాట్లాడుతూ ఈ హాకీ కార్నివాల్‌లో 8 జట్లు పాల్గొన్నాయని మాజీ ఒలింపియన్లు, అంతర్జాతీయ క్రీడాకారులు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారని చెప్పారు. 2023 ప్రపంచ కప్ భారత్ ఒడిస్సాలో జరగనుంది కాబట్టి భారత జట్టుకు మద్దతు ఇవ్వడానికి, ఉత్సాహపరిచేందుకు ఈ కార్నివాల్ ఉపయోగబడుతుందని తెలిపారు. 


Similar News