నాణ్యతా లోపం.. ప్రజలకు శాపం..

శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు చేపడుతున్నారు స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ.

Update: 2024-11-28 12:48 GMT

దిశ, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు చేపడుతున్నారు స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ. నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారు. సీసీ రోడ్లు, బాక్స్ నాళాలతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అయితే ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అత్యాశ ప్రజలకు శాపంగా మారుతుంది. కోట్లాది రూపాయలు వెచ్చించి చేపడుతున్న సీసీ రోడ్లు నాణ్యతా లోపంతో మట్టి కొట్టుకు పోతున్నాయి. వేసిన కొద్ది రోజులకే పాడై పోతున్నాయి. శేరిలింగంపల్లి జంట సర్కిళ్ల పరిధిలో వేసిన రోడ్లలో నాణ్యత లోపిస్తున్న ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లకు కొమ్ముకాయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జంట సర్కిళ్లలో నాసిరకంగా రోడ్లు..

శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్లలోని ఆయా డివిజన్ల పరిధిలో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టారు. గతంలో మధ్యలో నిలిచిన సీసీ రోడ్లు, బాక్స్ డ్రైనేజీ పనులు ఇప్పుడు కొనసాగిస్తున్నారు. ఈ పనులను చేపట్టిన కాంట్రాక్టర్లు సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఇష్టారీతిగా పనులు కొనసాగిస్తున్నట్లు గత కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీసీ రోడ్లను వేయాల్సిన పరిమాణంలో వేయకుండా, సిమెంట్, కాంక్రీట్, ఇసుక సరైన పరిమాణంలో వాడకుండా సీసీ రోడ్లను వేస్తున్నారని, సిమెంట్ కు బదులు ఎక్కువగా రాక్ డస్ట్ ను వాడుతున్నారని చాలా విమర్శలు ఉన్నాయి. ఇవన్నీ తెలిసినా ఇంజనీరింగ్ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. రోడ్లు వేసే సమయంలో ఆ వైపుకు కూడా వెళ్లకుండా గుత్తేదారుల ఇష్టానికి వదిలేస్తున్నారు.

పర్యవేక్షణ కరువు..

రోడ్లు వేసేటప్పుడు కిందిస్థాయి సిబ్బందికి వదిలేస్తున్న ఇంజనీర్లు ఆ తర్వాత కూడా నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణకు కూడా వెళ్లడం లేదని తెలుస్తుంది. దీంతో గుత్తేదారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారిపోయిందని, అటు అధికారులు కూడా ఆమ్యామ్యాలకు అలవాటు పడి చోద్యం చూస్తున్నారని, తమను అడిగేవారు ఎవరు అన్న రీతిలో వ్యవహరిస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రోడ్లు వేసిన తర్వాత నాణ్యతా పరీక్షలు నిర్వహించి, మెజర్మెంట్ చేసి బిల్లులు చెల్లించాలి కానీ శేరిలింగంపల్లి, చందానగర్ జంట సర్కిళ్లలో అవేమీ పట్టించుకోవడం లేదని ఇంజనీర్లు ఎంబీలు క్లియర్ చేసి బిల్లులు చెల్లిస్తున్నారని సమాచారం.

అధికారుల తీరుపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం..

శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్ల పరిధిలోని పలు డివిజన్లలో చేపట్టిన సీసీ రోడ్లు నాసిరకంగా నిర్మించడం పై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా నిర్మించిన రోడ్లు నాసిరకంగా ఉండడం వల్ల 6 నెలలలోపే దెబ్బతింటున్నాయని, దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని, అటు ప్రజాధనం కూడా దుర్వినియోగం అవుంతుందని అన్నారు. నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, బ్లాక్ లిస్ట్ లో పెట్టి వారికి మళ్ళీ పనులు అప్పగించకూడదని సూచించారు. ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లనే ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయని, ఇంత జరుగుతున్నా ఎందుకు మిన్నకుంటున్నారని ఇంజనీరింగ్ అధికారులులను ప్రశ్నించారు. అధికారులు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.


Similar News