ఆర్టీఐ దరఖాస్తులు అంటే లెక్కలేదా.. ఎందుకీ నిర్లక్ష్యం

Update: 2024-08-25 12:33 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరోః ఆర్టీఐలకు అధికారులు స్పందించట్లేదు. తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్న పనులు, పథకాలు, ఖర్చలు, ఇతర సమచారం కోరుతూ ఎన్ని దరఖాస్తులు చేసినా సరే ఎవరూ పెద్దగా స్పందించట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు పలు పథకాల ప్రచారానికి, ప్రభుత్వ ప్రచారానికి ఎన్ని నిధులు కేటాయించారు, తెలంగాణ ప్రభుత్వంలో 2023 డిసెంబర్ నుంచి 2024 జనవరి వరకు ఎంతమంది మంత్రులు విదేశాలకు వెళ్లారు, ఏ పని నిమిత్తం వెళ్లారనే వాటిపై ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. వారి విదేశీ పర్యటన ఖర్చు ఎంత, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎంతమంది ప్రభుత్వ అధికారులు, నాయకులు దావోస్ పర్యటనకు వెళ్లారు, ఎన్ని రోజులు, ఎన్ని ప్రాంతాలలో పర్యటించారు, వారి పర్యటన ఖర్చు ఎంత అని ఆర్టీఐ కింద దరఖాస్తు చేసినా అధికారులు సమాచారం ఇవ్వలేదు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది, ప్రచారానికి ఎంత ఖర్చు చేసింది, దరఖాస్తు ఫారాలు ఎన్ని ప్రింట్ చేశారు లాంటివి అడిగినా ఆన్సర్ చేయట్లేదు. వాటి ఖర్చు ఎంత, 2023 డిసెంబర్ 7నుంచి డిసెంబర్ 31వరకు తెలంగాణ ప్రభుత్వ నీటి పారుదల శాఖలో ఎంతమంది కాంట్రాక్టర్లకు ఎన్ని కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించారు, వాటి వివరాలు తెలపాలని కోరినా పట్టించుకోవట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజుల నియంత్రణపై తెలంగాణ ప్రభుత్వం ఏలాంటి చర్యలు తీసుకుంది, రాష్ట్రంలో డీఈఓలు, ఏంఈఓలు ప్రైవేట్ పాఠశాలల ఫీజులను నియంత్రించుటకు ఇప్పటివరకు వాళ్ల పరిధిలో ఎన్ని పాఠశాలలో తనిఖీలు చేపట్టారు , తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలన కార్యక్రమానికి ఇప్పటివరకు మొత్తం ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి.. అందులో ఎన్ని ఫిర్యాదులు పరిష్కరించారు, ప్రజాపాలన మెయింటే నెన్స్ కోసం ఎంత ఖర్చు చేశారనేది ఆర్టీఐ కింద కోరినా అధికారులు స్పందించకపోవడం విడ్డూరంగా ఉంది.


Similar News