అధికారుల నిర్లక్ష్యం.. ప్రజలకు ప్రాణసంకటం

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది

Update: 2024-12-11 11:15 GMT

దిశ, చైతన్యపురి : అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది జీహెచ్ఎంసీ అధికారుల తీరు. అభివృద్ధి పేరిట గుంతలు తీస్తారు కానీ వాటిని మాత్రం పూడ్చరు. తద్వారా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

సమస్య ఏమిటి..

లింగోజిగూడ డివిజన్ గ్రీన్ పార్క్ కాలనీ రోడ్ నెంబర్ 6 లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. డ్రైనేజీ పనుల కోసం తీసిన నాలా పనులు నత్తనడకన సాగుతున్నాయి. త్వరితగతిన పనులు పూర్తి చేయకపోవడం వలన ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం ప్రమాదవశాత్తు స్థానికుడైన ద్విచక్ర వాహనంపై ఇడ్లీ అమ్ముకునే సత్యనారాయణ తన టూ వీలర్ వాహనంతో సహా నాలాలో పడిపోయాడు. తృటిలో ప్రాణాపాయం తప్పింది. మరమత్తులు చేస్తామని మూడు నెలల క్రితం నాలా ఓపెన్ చేయడంతో ఏఈ నిర్లక్ష్యంతో మరమ్మతులకు నోచుకోలేదు. ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

అధికారులు పట్టింపు లేదు..

పలుమార్లు సంబంధించిన అధికారులకు పనులు పూర్తి చేయాలని స్థానికులు విన్నవించినా పట్టించుకోవడం లేదు. నాలలో తీసిన బురద నీళ్లు పక్కనే పడేయడంతో దుర్వాసనతో దోమలు విపరీతంగా ఉండడం వలన విష జ్వరాలతో ప్రజలు హాస్పిటల్ పాలవుతున్నారు. గత 2020 నుండి ఆవీధికి ఇప్పటివరకు వాహనాల రాకపోకలకు రోడ్డు లేదు. పలుమార్లు సంబంధించిన అధికారులకు రోడ్డు వేయమని అక్కడ నివాసం ఉండే కుటుంబాలు విన్నవించుకున్నా సరిపడా బడ్జెట్ లేదని మాట దాటేస్తున్నారు. ఏఈ, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం తో నాలా వలన అవస్థలు పడుతున్నారు.

సమస్య పరిష్కరించాలి..

ఓపెన్ నాలా ఉండడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైనేజీ దుర్వాసన దోమలు ఈగలు విజృంభించడం వలన అనారోగ్యాల పాలవుతున్నాం. స్థానిక కార్పొరేటర్ సమస్యపై స్పందించి త్వరితగతిన పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నాం. చిన్న పిల్లలు పెద్దలకు ప్రాణహాని కలగవచ్చని స్థానిక నివాసం ఉండే సేవాలాల్ బంజారా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మోతిలాల్ నాయక్ అన్నారు.


Similar News