కేసీఆరే విగ్రహాన్ని మార్చేశారు.. సామా రామ్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు
మాజీ సీఎం కేసీఆర్‌పై సామా రామ్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు..
దిశ, తెలంగాణ బ్యూరో: ‘కేటీఆర్ బుర్రలో ఆలోచనలు..మూసీలో మురికి ఒకటేనని’ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ బుర్ర, మూసీ మురికి దుర్గంధంతో నిండిపోయాయన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్‌ఎస్ రాజకీయం చేయడం తగదన్నారు. బీఆర్ఎస్ కూడా విగ్రహరూపాన్ని మార్చిందన్నారు. 2007లోని విగ్రహానికి , 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఏర్పాటు చేసిన విగ్రహానికి తేడా ఉన్నదన్నారు. కేసీఆరే విగ్రహాన్ని మార్చేశాడన్నారు. కేటీఆర్ తమను విమర్శించే ముందు, వాళ్ల నాన్న కేసీఆర్‌ను అడగాల్సిన అవసరం ఉన్నదన్నారు. తాము మళ్లీ పవర్‌లోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసి వేసి తెలంగాణ విగ్రహం పెడతామని కేటీఆర్ భ్రమల్లో ఉన్నాడన్నారు. కేటీఆర్ మదం ఎక్కి మాట్లాడుతున్నాడని రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు.
పవర్ పోయినా అహంకారం తగ్గలేదన్నారు. లిక్కర్ చెల్లి కూడా తమను ప్రశ్నించడం విచిత్రంగా ఉన్నదన్నారు. గతంలో ధర్నా చౌక్ ఎత్తివేశారన్నారు. కానీ తమ ప్రభుత్వం ప్రజాభవన్ వేదికగా ప్రజావాణిని కొనసాగిస్తుందన్నారు. ఉద్యమంలో ప్రతి వ్యక్తి ఛాతీ మీద టీజీ అని రాసుకున్నారని, కానీ బీఆర్ ఎస్ ఏర్పడిన తర్వాత టీఎస్ కు మార్చేశారన్నారు. తమ ఏడాది పాలనలో అన్ని వర్గాలు సంతృప్తి కరంగా ఉన్నాయన్నారు. సమస్యలు ఉంటే ప్రతిపక్ష నేత, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రశ్నించాలన్నారు. అసెంబ్లీ సెషన్స్ నుంచి తప్పించుకోవద్దన్నారు. బీఆర్‌ఎస్ చేసిన పాపాలు ఉత్తగానే తొలగిపోవన్నారు. గద్దర్ లాంటి వ్యక్తులకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఇవన్నీ ప్రజలు గమనించి కేసీఆర్ అండ్ టీమ్ కొలువు పీకేశారని సామా రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.