Breaking: తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాశ్ రెడ్డికి ఊరట
ఎంపీ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది...
దిశ, వెబ్ డెస్క్: ఎంపీ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. వివేకానందారెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్‌పై విచారించిన ధర్మాసనం ఆయనను బుధవారం వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. అవినాశ్ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయనను అరెస్ట్ చేయొవద్దని సూచించింది. అంతేకాదు బుధవారం తుది తీర్పు ఇవ్వనుంది. దీంతో అవినాశ్ రెడ్డికి బుధవారం వరకు రిలీఫ్ వచ్చినట్లు అయింది.
కాగా అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో వాడీవేడీ వాదనలు సాగాయి. పొలిటికల్ కుట్రలో భాగంగా వివేకానందారెడ్డి హత్య జరిగిందన సీబీఐ సంచలన వాదనలు వినిపించారు.
అటు హైకోర్టు.. ఇటు సీబీఐ మధ్య వాదనలు, ప్రశ్నలు ఉత్కంఠగా సాగాయి. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని సీబీఐ ఆరోపించింది. నోటీసులు ఎప్పుడు ఇచ్చినా తప్పించుకుంటున్నారని...కోర్టులకు వెళ్లి నోటీసులు తెచ్చుకుని కాలయాపన చేస్తున్నారని ఆరోపించింది. ఈ హత్యకేసులో ఇప్పటికే పలువురుని విచారించామని మరికొందరిని అరెస్ట్ చేశామని వారికి లేని ప్రత్యేకత ఎంపీ అవినాశ్ రెడ్డికి ఏంటని ప్రశ్నించారు. ఎందుకు సీబీఐ విచారణకు సహకరించడం లేదని ప్రశ్నించారు. ఎంపీ అవినాశ్ రెడ్డిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని సీబీఐ తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించింది. రెండు రోజులుగా ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతుండటంతో బెయిల్ వస్తుందా రాదా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇకపోతే సీబీఐ వాదనలు వినిపిస్తున్న సమయంలో సీబీఐ ఎస్పీ వికాస్ సింగ్, అదనపు ఎస్పీ ముఖేష్ శర్మ, వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు తెలంగాణ హై కోర్టులోనే ఉన్నారు.
ఎంపీ అవినాశ్‌ను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉంది
మాజీమంత్రి వైఎస్ అవినాశ్ రెడ్డి హత్యకేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఉత్కంఠ నెలకొంది. సీబీఐ అరెస్ట్ చేస్తుందనే ప్రచారంతో ఎంపీ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్‌పై వాడీ వేడిగా తెలంగాణ హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎంపీ అవినాశ్ రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించగా శనివారం సీబీఐ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్ వాదనలు వినిపిస్తున్నారు. కేసు దర్యాప్తులో మొదట్నుంచీ ఎంపీ అవినాశ్ రెడ్డి అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు అని ఆరోపించారు. దర్యాప్తు తమ పద్ధతి ప్రకాశం చేస్తాం కానీ.. అవినాశ్ కోరుకున్నట్లు కాదు అని వివరించారు. అవినాశ్ రెడ్డి విచారణకు సహకరించడం లేదు అని ఆరోపించారు. దర్యాప్తు జాప్యం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు అని వాదించారు. నోటీసు ఇచ్చినప్పుడల్లా ఏదో కారణం చెప్పి హాజరు కావట్లేదు అని తెలిపింది. ఎంతో మందిని విచారించాం.. కొందరిని అరెస్టు చేశాం. మిగతావారికి లేని ప్రత్యేక పరిస్థితి అవినాశ్‌కు ఏమిటి? అని సీబీఐ ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఎంపీ అవినాశ్‍కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అవినాశ్‍ను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని సీబీఐ హైకోర్టుకు తెలిపింది.
హత్యకు నెల రోజుల ముందే కుట్ర
సీబీఐ దర్యాప్తుపై తెలంగాణ హైకోర్టు కీలక ప్రశ్నలు సంధించింది. ఈ హత్యకేసు విచారణలో జాప్యంపై సీబీఐను నిలదీసింది. అయితే ఎంపీ అవినాశ్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని సీబీఐ తెలిపింది. మరోవైపు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించింది. ఈ హత్యకేసులో సాక్ష్యాలను తారుమారు చేయడంలో ఉదయ్ కుమార్ రెడ్డి పాత్ర ఉందని తెలిపారు. అయితే సీబీఐ విచారణకు ఇరువురు కూడా సహకరించడం లేదని తెలిపారు. వీరంతా సహకరిస్తే కేసు దర్యాప్తు ఎప్పుడో పూర్తయ్యేదని అన్నారు. కోర్టుల్లో రకరకాల పిటిషన్లు వేస్తూ అవినాశ్ రెడ్డి జాప్యం చేస్తున్నారు అని సీబీఐ ఆరోపించింది. మరోవైపు వైఎస్ వివేకా హత్యకు అనేక ఉద్దేశాలు చెబుతున్నారని.. ప్రధాన కారణమేమిటని హైకోర్టు ప్రశ్నించింది. ఇందుకు సీబీఐ న్యాయవాది సమాధానం ఇచ్చారు. రాజకీయ ఉద్దేశాలే వివేకానందరెడ్డి హత్యకు ప్రధాన కారణమని వెల్లడించారు. హత్యకు నెలరోజుల ముందే కుట్ర జరిగిందని పేర్కొన్నారు.
రక్తపు మరకలను తుడచడం ఎవిడెన్స్ టెంపర్ ఎలా అవుతుంది?:హైకోర్టు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో రక్తపు మరకలు తుడిచిపెట్టి సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారని సీబీఐ కోర్టులో ఆరోపించింది. అయితే వివేక మృతదేహం చూడగానే గాయాలు కనిపించాయా - ? ఒకవేళ కనిపిస్తే వివేకా మృతదేహం చూసిన ఎవరైనా సరే ఇది మర్డర్ అని చెప్పగలరు అని చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు రక్తపు మరకలను తుడచడం ఎవిడెన్స్ టెంపర్ ఎలా అవుతుంది అని హైకోర్టు ప్రశ్నించింది. క్లియర్ గా మృతదేహం చూస్తే అది మర్డర్ అని తెలుస్తుంది అన్నప్పుడు రక్తపు మరకలతో అవసరం ఎం ఉంది అని హైకోర్టు ప్రశ్నించింది. హత్య సమయంలో రక్తపు మరకలు కీలకమని అయితే వాటి ప్రస్తావన లేకుండా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి సీఐకు ఫిర్యాదు చేశారని తెలిపారు. శివశంకర్ రెడ్డి బెదిరింపులతో అటు పీఏ కృష్ణారెడ్డి రక్తపు మరకల గురించి ఎక్కడా ప్రస్తావించలేదని అటు సీఐ శంకరయ్య సైతం సరిగ్గా దర్యాప్తులో పొందుపరచలేదని సీబీఐ తెలిపింది.
వాట్సాప్ కాల్‌లో మాట్లాడటమే కీలకం
వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజులు ఎంపీ అవినాశ్ రెడ్డి సరైన సమాచారం ఇవ్వలేదని సీబీఐ ఆరోపించింది. హత్య తర్వాత రోజు జమ్మలమడుగు వెళ్లినట్లు ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి చెప్పారని తెలిపింది. అయితే ఎంపీ అవినాశ్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో జమ్మలమడుగు షెడ్యూల్‌లో లేదని తెలిపారు. సీబీఐకు ఎంపీ అవినాశ్ రెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. హత్య జరిగిన రోజు ఎంపీ అవినాశ్ రెడ్డి వాట్సాప్ కాల్ చేశారని సీబీఐ ఆరోపించింది. అయితే వాట్సాప్ కాల్ ఎవరితో మాట్లాడారు అనేది ఇంటర్నెట్ ద్వారా గుర్తించడం కష్టం అని తెలిపింది. అందువల్లే ఎంపీ అవినాశ్ రెడ్డిని విచారిస్తే వాట్సాప్ కాల్ ద్వారా ఎవరితో మాట్లాడారో తెలుస్తుందని సీబీఐ తెలంగాణ హైకోర్టులో వాదించారు. అయితే అవినాశ్ రెడ్డి వాట్సాప్ కాల్ చేస్తున్నప్పుడు గంగిరెడ్డి ఫోన్ కూడా బిజీగా ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది. ఈనెల 12న ఎంపీ అవినాశ్ రెడ్డికి సంబంధించిన ఐపీడీఆర్ డేటా సేకరించినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఎంపీ అవినాశ్ రెడ్డి ఫోన్ స్వాధీనం చేసుకున్నారా అని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. అయితే స్వాధీనం చేసుకోలేదని సీబీఐ తెలపగా ఇలాంటి కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని తెలంగాణ హైకోర్టు సూచించింది.
గంగిరెడ్డి ద్వారా హత్యకు కుట్ర
ఇకపోతే 2019 ఎన్నికల్లో కడప లోక్‌సభ టికెట్ వైఎస్ విజయమ్మ లేదా వైఎస్ షర్మిలకు ఇవ్వాలని మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్ వద్ద మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ప్రస్తావించారని సీబీఐ తెలిపింది. ఈ ప్రతిపాదన ఎంపీ అవినాశ్ రెడ్డికి ఇష్టం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ వివేకానందరెడ్డిపై పై చేయి సాధించేందుకు ఎంపీ అవినాశ్ రెడ్డి హత్యకు ప్లాన్ చేశారని ఆరోపించారు. గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి ద్వారా ఈ హత్యకు పురిగొలిపారన్నారు. శత్రువుకు శత్రువే మిత్రుడు అన్నట్లుగా గంగిరెడ్డి ఈ హత్య కేసులోవివేకానందరెడ్డి శత్రువులందరినీ ఈ హత్యలో పాల్గొనేలా చేశారని ఆరోపించారు. ఈ హత్యకు రూ.4కోట్లు వరకు ఖర్చు పెట్టినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. రూ.4కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం శివశంకర్ రెడ్డికి ఎక్కడ ఉందని సీబీఐ అనుమానం వ్యక్తం చేసింది. ఎంపీ అవినాశ్ రెడ్డి శివశంకర్‌కు డబ్బులు ఇస్తే ఆ సొమ్మును గంగిరెడ్డికి అందజేసినట్లు తెలిపారు. దస్తగిరికి ఇచ్చిన రూ.75 లక్షల్లో 45 లక్షల రూపాయలు మున్నా లాకర్ నుంచి స్వాధీనం చేసుకున్న విషయాన్ని సీబీఐ గుర్తు చేసింది. ఈ అన్ని అంశాలపై క్లారిటీ రావాలంటే ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
Read more:
వైసీపీ కౌరవ సేనను ఓడిద్దాం.. మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు