రైతు భరోసా ఇవ్వలేం.. ఖరీఫ్‌ సాయంపై తేల్చేసిన మంత్రి తుమ్మల

ఆరు గ్యారంటీల్లో ఒకటైన రైతు భరోసా స్కీమ్‌ను ఈ ఖరీఫ్ సీజన్ నుంచే అమలు చేయాలని ప్రభుత్వం తొలుత భావించినా కొన్ని సాంకేతిక కారణాలతో అది సాధ్యం కాదనే నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు...

Update: 2024-10-19 15:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఆరు గ్యారంటీల్లో ఒకటైన రైతు భరోసా స్కీమ్‌ను ఈ ఖరీఫ్ సీజన్ నుంచే అమలు చేయాలని ప్రభుత్వం తొలుత భావించినా కొన్ని సాంకేతిక కారణాలతో అది సాధ్యం కాదనే నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీంతో వచ్చే రబీ సీజన్ నుంచి ఎకరానికి రూ. 7,500 చొప్పున పంటను సాగు చేస్తున్న రైతులందరికీ రైతుభరోసా పేరుతోనే ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఖరీఫ్ సీజన్ నుంచి రైతులకు ఇవ్వాలని అనుకున్నా కేబినెట్ సబ్ కమిటీ నుంచి రిపోర్టు ఇంకా ప్రభుత్వానికి చేరలేదని, దానిపై మంత్రివర్గంలో చర్చించి విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున ఆలస్యమవుతుందన్నారు. బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో శనివారం మీడియాతో మాట్లాడుతూ పంటను వేసిన రైతులకే, సాగు చేస్తున్న భూములకే రైతుభరోసాను ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. వ్యవసాయం చేయని రైతులకు, భూములకు ఈ స్కీమ్ కింద ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందదని క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వం సాగులో లేని భూములకు, వ్యవసాయ చేయని రైతులకు కూడా రైతుబంధు పేరుతో అందించిందని, దీంతో రూ. 25 వేల కోట్ల మేర ప్రజాధనం వృథా అయిందని మంత్రి గుర్తుచేశారు.

రైతుభరోసా పథకాన్ని ప్రతి ఎకరాకు రూ. 7,500 వేల చొప్పున (ఒక్కో సీజన్‌కు) ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ తన అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. కౌలు రైతులకు కూడా ఇంతే మొత్తంలో ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది. భూమిలేని రైతులను రైతుకూలీలు, కార్మికులుగా గుర్తించి సంవత్సరానికి రూ. 12 వేల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే కౌలురైతులను గుర్తించడానికి ప్రస్తుతం ప్రభుత్వంలో ఎలాంటి చట్టం లేనందున లీగల్ చిక్కులు రాకుండా అవలంబించాల్సిన విధానంపై సిఫారసులు, సూచనలు చేయాల్సిందిగా కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అన్ని జిల్లాల్లో ఒక్కో రోజు చొప్పున అధ్యయనం చేసిన సబ్ కమిటీ నివేదికను ఇంకా ప్రభుత్వానికి సమర్పించలేదు. అందులో చేసే సిఫారసులు, సూచనలకు అనుగుణంగా ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించడంపై స్పష్టమైన విధానాన్ని రూపొందించాల్సి ఉంటుంది. ఆ నివేదిక ఇంకా ఖరారు కాకపోవడంతో ఈ సీజన్‌ నుంచి అమలు చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. లీగల్ చిక్కులను పరిగణనలోకి తీసుకుని వచ్చే రబీ సీజన్ నుంచి అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి మాటల ద్వారా స్పష్టమైంది.

మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా సన్న వడ్లను పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ. 500 చొప్పున బోనస్‌ను ఈ ఖరీఫ్ సీజన్‌ నుంచే అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆర్థిక వెసులుబాటు లేకపోయినా రుణమాఫీ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం 26 రోజుల వ్యవధిలోనే 22 లక్షల మందికి రూ. 18 వేల కోట్ల మేరకు రెండు లక్షల రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ చేసినట్లు తెలిపారు. కొద్దిమంది రైతుల ఆధార్, బ్యాంకు ఖాతా, రేషను కార్డు వివరాలు మిస్‌మ్యాచ్ కావడం, సరిగ్గా లేకపోవడంతో వారికి రుణమాఫీ కాలేదని, వీటిని పరిశీలించిన తర్వాత అందజేయనున్నట్లు వివరించారు. దీనికి తోడు రెండు లక్షల రూపాయలకంటే ఎక్కువ రుణం తీసుకున్నవారికి సీలింగ్ ప్రకారం రెండు లక్షల రూపాయలను మాఫీ చేస్తామని, కానీ అంతకంటే ఎక్కువ తీసుకున్న రుణన్ని బ్యాంకులకు చెల్లించిన తర్వాతనే ఇది అమలవుతుందన్నారు. ఆ చెల్లింపు కోసం త్వరలోనే షెడ్యూలును విడుదల చేస్తామని, మొత్తం ప్రక్రియను డిసెంబరుకల్లా కంప్లీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.

ఇప్పటివరకు అమలైన రుణమాఫీ స్కీమ్‌లో రాష్ట్రంలోని 42 బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించుకున్నామని మంత్రి తెలిపారు. మొత్తం 42 లక్షల మంది లబ్ధిదారులకు (25 లక్షల కుటుంబాలు) రుణమాఫీ కోసం రూ. 31 వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసిందని, ఇందులో రూ. 18 వేల కోట్లు ఇప్పటికే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్లు తెలిపారు. మరో 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉన్నదన్నారు. తెల్ల రేషను కార్డు లేని 3 లక్షల మందికి కూడా డిసెంబరులో కుటుంబాలను నిర్ధారణ చేసి రూ. 2,500 కోట్ల మేర మాఫీ చేయనున్నట్లు తెలిపారు. త్వరలో జరగనున్న కేబినెట్ భేటీలో 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ రుణాన్ని బ్యాంకుల నుంచి తీసుకున్న రైతుల గురించి చర్చించి ఎప్పటిలోగా మాఫీ చేయాలో చర్చించి దానికి తగినట్లుగా షెడ్యూలు రూపొందిస్తామన్నారు. పంటల భీమా పథకం గత ప్రభుత్వంలో అమలు కాలేదని, ఇప్పుడు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, వచ్చే సీజన్ నుంచి ఇది ఫంక్షనింగ్‌లోకి వస్తుందన్నారు. ప్రతీ రైతు పంటకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని మంత్రి తుమ్మల స్పష్టంచేశారు. 


Similar News