ఎన్ని ప్రదర్శనలైనా ఇస్తారు: కేటీఆర్‌పై మంత్రి సీతక్క సెటైర్లు

మూసీ న‌ది పున‌రుజ్జీవంపై మాజీ మంత్రి కేటీఆర్ ఆరోప‌ణ‌ల్లో ప‌స లేద‌ని మంత్రి సీతక్క కొట్టిపారేశారు..

Update: 2024-10-19 14:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మూసీ న‌ది పున‌రుజ్జీవంపై మాజీ మంత్రి కేటీఆర్ ఆరోప‌ణ‌ల్లో ప‌స లేద‌ని, ఆయన అక్కసులో అర్థం లేద‌ని పంచాయ‌తీ రాజ్ గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి డాక్టర్ ధ‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క మండిప‌డ్డారు. మూసీ పున‌రుజ్జీవన‌ ప్రాజెక్టును మొద‌ట్లో వ్యతిరేకించిన కేటీఆర్..ఇప్పుడు ప్రజాగ్రహానికి త‌లొగ్గి తాము వ్యతిరేకం కాద‌ని స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నార‌ని మండిపడ్డారు. పిల్లి మొగ్గలు వేస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. మూసీ డీపీఆర్ ఎప్పుడో సిద్ధం చేశామని చెబుతున్న కేటీఆర్, ప‌దేండ్లుగా అధికారంలో ఉండి మూసీ నీటిని క‌నీసం ఎందుకు శుద్ది చేయ‌లేక‌పోయార‌ని ప్రశ్నించారు. నిజంగా మూసీ ప్రక్షాళన పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఇప్పుడు యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. అభూత కల్పనలకు, ఆకాశానికి నిచ్చెనలు వేయడంలో కేటీఆర్ దిట్ట అని పేర్కొన్నారు. ఏలాంటి డీపీఆర్ లేకుండానే కాళేశ్వరం పేరుతో ల‌క్ష కోట్లను గోదారి పాలు చేసిన బీఆర్ఎస్ నేత‌ల‌కు, డీపీఆర్ గురించి మాట్లాడే క‌నీస అర్హత లేద‌న్నారు. మూసీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో? బీఆర్ ఎస్ స్పష్టం చేయాలన్నారు.

మూసీ న‌దీ గ‌ర్భంలో ఉన్న ఒక్కొక్క కుటుంబాన్ని ఒప్పించి మెప్పించి అన్ని రకాలుగా చేయూత ఇస్తున్నామన్నారు. ఆ తర్వాతే మరో చోట వాళ్లకు స్థిర‌ నివాసం ఏర్పాటు చేసి, పునరావాసం కల్పించిన త‌ర్వాతే ఇండ్లు ఖాళీ చేస్తున్నామ‌ని తెలిపారు. ప్రజా ప్రభుత్వం పై నమ్మకంతో మూసీ ప‌రివాహక ప్రాంత ప్రజలు స్వచ్ఛందంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్తుంటే..కేటీఆర్ తట్టుకోలేక లేని పోని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని మంత్రి సీత‌క్క మండిప‌డ్డారు. మూసీ ప్రాంత ప్రజలు బాధ‌లు పట్టని కేటీఆర్..మిట్ట మీద కూర్చుని ఎన్ని ప్రదర్శనలైనా ఇస్తారని విమర్శించారు. 2020లో హైద‌రాబాద్‌లో వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా 33 మంది మృత్యువాత ప‌డ్డార‌ని సీత‌క్క గుర్తు చేసారు. ఇలాంటి మృత్యుఘోష పున‌రావృతం కాకుండా..శాశ్వర ప‌రిష్కార మార్గం చూపేందుకే మూసీ పున‌రుజ్జీవనానికి పూనుకున్నామ‌ని మంత్రి సీత‌క్క తెలిపారు. 


Similar News