సమ్మె దిశగా అంబేద్కర్ వర్సిటీ ఉద్యోగులు

అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి(జేఎన్ఏఎఫ్ఏయూ) కేటాయించడాన్ని నిరసిస్తూ అంబేద్కర్ వర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ సమ్మె దిశగా అడుగులు వేస్తోంది....

Update: 2024-10-19 17:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి(జేఎన్ఏఎఫ్ఏయూ) కేటాయించడాన్ని నిరసిస్తూ అంబేద్కర్ వర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ సమ్మె దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు జేఏసీ సభ్యులు శనివారం రిజిస్ట్రార్ కు సమ్మె నోటీసు అందించారు. శనివారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో విశ్వవిద్యాలయ పరిపాలన భవనం, అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందులో భాగంగా పలువురు మంత్రులు, అధికారులను కలిసి సమస్యను వివరించామని జేఏసీ చైర్ పర్సన్ పల్లవీ కాబ్డే, సెక్రటరీ జనరల్ మహేష్ గౌడ్ ఉద్యోగులకు వివరించారు. భూ కేటాయింపు ఆలోచనను వెంటనే ఉప సంహరించుకోవాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని తెలిపారు. విశ్వవిద్యాలయ విస్తరణకు, మౌలిక వసతుల కల్పనకు ఎక్కువ మొత్తంలో భూమి అవసరం ఉందని, ఇలాంటి క్రమంలో అందుబాటులో ఉన్న కొద్దిపాటి భూమిలో 10 ఎకరాల భూమి వేరే యూనివర్సిటీకి కేటాయింపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహారించుకోవాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో ఈ ఆందోళనను మరింత ఉధృతంగా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ పుష్పా చజ్రపాణి, నారాయణ రావు, ఎన్‌సీ వేణు గోపాల్, రుశేంద్ర మణి, అవినాష్, రాఘవేంధర్, అధ్యాపకేతర ఉద్యోగుల సంఘం నేతలు ప్రేమ్ కుమార్, షబ్బీర్, యాకేష్ దైద, కంభంపాటి యాదగిరి, కిషోర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్ధుల నిరసన

జేఏసీ నిరసన అనంతరం వర్సిటీ పరిశోధక విద్యార్ధుల సైతం నిరసనకు దిగారు. ఉన్నత విద్య వ్యాప్తికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సింది పోయి భవిష్యత్ తరాలకు విద్యను దూరం చేసేలా ప్రభుత్వం కుట్ర పూరిత నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు, లేదంటే రాష్ట్రంలోని అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ నిరసనలో పూర్వ విద్యార్ధుల సమాఖ్య అధ్యక్షుడు సాక వెంకటేశ్వర్లు, జయ ప్రకాష్, వెంకటేష్ గౌడ్, విజయ్ కుమార్, ప్రకాష్, కృష్ణయ్య తదితరులు ఉన్నారు.


Similar News