ఎల్బీ‌నగర్‌లో వరద.. బురద!

ఎల్బీనగర్ నియోజకవర్గంలో ముంపు సమస్యలు వెంటాడుతున్నాయి. చిన్నపాటి వర్షం పడిందంటే కాలనీలు, బస్తీల ప్రజల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

Update: 2024-08-20 02:33 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో: ఎల్బీనగర్ నియోజకవర్గంలో ముంపు సమస్యలు వెంటాడుతున్నాయి. చిన్నపాటి వర్షం పడిందంటే కాలనీలు, బస్తీల ప్రజల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ వర్షం నీరు చేరి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లు, రోడ్లు, అపార్టు‌మెంట్ సెల్లార్ తదితర ప్రాంతాలను వరద నీరు ముంచెత్తుతోంది. ముంపు సమస్య గురించి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్ని పర్యాయాలు విన్నవించినా పట్టించుకోవడం లేదని, సమస్య రోజురోజుకు మరింత జఠిలం గా మారుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .

ఆస్తి, ప్రాణ నష్టం..

వర్షాకాలం వచ్చిందంటే ఎల్బీ‌నగర్ నియోజకవర్గ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు . గతంలో భారీ వర్షాలు కురిసిన సమయంలో ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. 10 సెంటీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైన ప్రతిసారి వరద నీరు కాలనీలు, బస్తీలు, అపార్టుమెంట్లు, రోడ్లను ముంచెత్తుతుండగా వందల కోట్లలో ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. కొన్నేళ్లుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రజాప్రతినిధులు, అధికారులు ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నియోజకవర్గంలో వర్షం ముంపు ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపాల్సి ఉండగా వారు అలాంటివేమీ చేయలేదని ప్రజలు మండిపడుతున్నారు. నాగోల్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప కాలనీలో గతంలో కురిసిన వర్షానికి సుమారు 800 ఇండ్లు నీట మునిగాయి. లింగోజిగూడ, సరూర్ నగర్, పీ అండ్ టీ కాలనీ, శారదానగర్, వీవీ నగర్, చైతన్యపురి, కోదండరాం నగర్, కొత్తపేట తదితర కాలనీలను వరద నీరు ముంచెత్తింది.

ఫలితంగా కరెంట్, మంచినీరు, ఇంటర్నెట్ సౌకర్యం లేకుండా పోయింది. గతంలో తపోవన్ కాలనీలో వరద నీటిలో ఓ ఎలక్ట్రీషియన్ కొట్టుకుపోయి దుర్మరణం పాలయ్యారు. ఇలా ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నా ఎవరూ పట్టించుకోలేదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి . తాజాగా మళ్లీ వర్షాకాలం రాగా ముంపు సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా పరిష్కారం కాకుండా ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వనస్థలిపురం పనామా గోడౌన్స్ ప్రధాన రోడ్డుపై వరద నీరు చేరి వరుస రోజుల్లో రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి. రోడ్డు పై ప్రయాణిస్తున్న కార్లు రెండు వరద నీరు చేరిన గుంతల్లో పల్టీ కొట్టాయి.సకాలంలో అక్కడున్న వారు స్పందించడంతో ప్రాణ నష్టం తప్పింది. ఇదే పరిస్థితి నియోజకవర్గంలో చాలా చోట్ల నెలకొంది .

దెబ్బతిన్న రోడ్లు ..

ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని చాలా చోట్ల రోడ్లు దెబ్బతిని రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా కాలనీ రోడ్లు దెబ్బతిని ఏండ్లు గడుస్తున్నా తూతూ మంత్రంగా మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు మండిపడుతున్నారు. భారీ వర్షాలు కురిసిన సమయంలో చైతన్యపురి ప్రధాన రోడ్డుపై నీరు వరదలా పారుతోంది. సరూర్ నగర్ చెరువు కట్ట కింది భాగంలోని శారదానగర్, కోదండరాం నగర్, పీ అండ్ కాలనీ తదితర ప్రాంతాల్లో బోట్లలో తిరగాల్సిన దుస్థితి నెలకొంది. సంవత్సరాలుగా సమస్యలు వెంటాడుతున్నా వాటికి శాశ్వత పరిష్కారం చూపడం లేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ఎల్బీనగర్ నియోజకవర్గంలో ముంపు సమస్యలకు చెక్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ, జలమండలి, ఆర్‌అండ్‌బీ, విద్యుత్, పీఆర్ తదితర విభాగాల అధికారులు సమన్వయంతో పని చేసి వరద ముంపు సమస్య లేకుండా చూడాలనే అభిప్రాయాలు ప్రజల నుంచి వినబడుతున్నాయి.


Similar News