వైఎస్సార్టీపీ కి మూకుమ్మడిగా రాజీనామాలు
వైఎస్సార్టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయనంటూ ప్రకటించడంతో వైఎస్సార్టీపీ కి నేతలు మూకుమ్మడిగా గట్టు రామచంద్రరావు నేతృత్వంలో రాజీనామాలు ప్రకటించారు.
దిశ, ఖైరతాబాద్ : వైఎస్సార్టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయనంటూ ప్రకటించడంతో వైఎస్సార్టీపీ కి నేతలు మూకుమ్మడిగా గట్టు రామచంద్రరావు నేతృత్వంలో రాజీనామాలు ప్రకటించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆంధ్ర షర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలతో , తెలంగాణ ప్రజలను మోసం చేసిన షర్మిల వెంటనే తెలంగాణను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును షర్మిల చెడగొట్టారని , కాంగ్రెస్ లో నిలబడతా అని చివరగా అందరిని రోడ్డు మీద నిలబెట్టిందని తెలిపారు. ఇన్ని రోజులు షర్మిలను సపోర్ట్ చేసినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతున్నాము అన్నారు. మేమంతా షర్మిలను తెలంగాణ నుండి బహిష్కరిస్తున్నామన్నారు.
తెలంగాణ ప్రజలంటే షర్మిలకు చిన్నచూపు , షర్మిల రాజకీయాలకు పనికిరాదు అన్నారు. భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే చెబుతాం అని తెలిపారు. వైఎస్సార్టీపీ నాయకురాలు సత్యవతి మాట్లాడుతూ వైఎస్సార్ అభిమానులను షర్మిల మోసం చేసింది అన్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తాము అంటే పార్టీలో చేరానని, పాదయాత్రలో పాల్గొన్నానని తెలిపారు. వైఎస్సార్ కార్యకర్తలు అందరూ అభిమానంతో పార్టీలో చేరారని, షర్మిల అందరినీ మోసం చేసిందన్నారు. రాబోయే ఎన్నికల్లో షర్మిల ఎక్కడ పొటీ చేసినా ఓడగొడతాము అన్నారు. వైఎస్సార్టీపీ నేత గణేష్ నాయక్ మాట్లాడుతూ బయ్యారం గుట్టను దోచుకోవడానికి వచ్చిన షర్మిల ఖబర్దార్అన్నారు. తెలంగాణ సొమ్మును దోచుకోవడానికి వచ్చిందని, ఆమెకు తెలంగాణలో తిరిగే హక్కు లేదన్నారు. ఆమెకు తగిన గుణపాఠం చెబుతాము అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్టీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.