జనసంద్రంగా మారిన ఖైరతాబాద్...

ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి ఆదివారం చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులతో కిక్కిరిసిపోయింది.

Update: 2024-09-15 14:11 GMT

దిశ, ఖైరతాబాద్ : ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి ఆదివారం చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులతో కిక్కిరిసిపోయింది. మంగళవారం శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలు ఉండటంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి ఖైరతాబాద్ మహా గణపతి దర్శనాలు నిలిపివేయనున్నట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు. శోభయాత్రకు ఇప్పటికే భారీ వాహనాలు రావడంతో వెల్డింగ్ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. దీంతో ఖైరతాబాద్ చుట్టుపక్కల ప్రాంతమంతా కూడా ఇసుక వేస్తే రాలనంత జనం కనిపించారు.

17న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర :

సెప్టెంబర్ 17న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ తర్వాత హుస్సేన్ సాగర్ లో మహాగణపతి నిమజ్జనం జరగనుంది. ఆదివారం నుంచి వెల్డింగ్ పనులను ప్రారంభించారు. సోమవారం అర్ధరాత్రి కల్లా వెల్డింగ్ పనులు పూర్తి చేసుకొని గణనాథుడు ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో కదలనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. శోభాయాత్రలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ పర్యవేక్షణలో బ్యాండ్ బాజాలతో కళాకారుల ఆటపాటలతో సాగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు.

ఖైరతాబాద్ గణనాథుడి రూట్ మ్యాప్ :

ఖైరతాబాద్ మహా గణనాథుడు మంగళవారం ఉదయం శోభాయాత్రకు 4 గంటల సమయంలో మండపం వద్ద నుండి బయలుదేరి టెలిఫోన్ భవన్ వైపుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియట్ ముందు నుంచి ఎన్టీఆర్ మార్కు వద్దకు చేరుకొని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం జరుగుతుంది. కాబట్టి ఖైరతాబాద్ నుండి లకిడికపూల్, సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్, రాజ్ భవన్ నుంచి ట్యాంక్ బండ్ , తెలుగు తల్లి ఫ్లైఓవర్ తో పాటు హుస్సేన్ సాగర్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.


Similar News