ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణలో కీలక ఘట్టం..

ఓల్డ్ సిటీలో రెండో దశ మెట్రో పనులు ప్రారంభించడానికి మార్గం సుగమమవుతోంది. ప్రభావిత ఆస్తుల యజమానులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడానికి ముహూర్తం ఖరారు చేసింది.

Update: 2025-01-06 03:08 GMT

దిశ, సిటీబ్యూరో : ఓల్డ్ సిటీలో రెండో దశ మెట్రో పనులు ప్రారంభించడానికి మార్గం సుగమమవుతోంది. ప్రభావిత ఆస్తుల యజమానులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడానికి ముహూర్తం ఖరారు చేసింది. కారిడార్ - 6లో ఎంజీబీఎస్- చంద్రాయణ్‌గుట్ట మార్గంలో 1100 ప్రభావిత ఆస్తులు ఉండగా, పెద్ద ఎత్తున వాటి యజమానులు స్వచ్ఛందంగా తమ స్థలాలను మెట్రో రైలు నిర్మాణం కోసం ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. ఇంతవరకు 169 మంది వారి అనుమతి పత్రాలను ఇచ్చారని వెల్లడించారు. వాటిలో 40కి పైగా ఆస్తుల యాజమాన్యానికి సంబంధించిన ధ్రువీకరణ పూర్తయిందన్నారు. తొలి దశలో ఈ 40కి పైగా ఆస్తుల యజమానులకు ఈ నెల 6న చెక్కుల పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు. వారికి నష్టపరిహారాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ చెక్కుల రూపంలో అందజేస్తారని తెలిపారు.

చదరపు గజానికి రూ.81 వేలు..

ప్రభావిత ఆస్తులకు చదరపు గజానికి రూ.81 వేలు ఇవ్వడానికి ఇప్పటికే జిల్లా కలెక్టర్ నిర్ణయించారని, దీనితో పాటు రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ చట్టం ప్రకారం, పునరావాస పరిహారం, తొలగించే నిర్మాణాలకు కూడా నష్టపరిహారాన్ని అర్హులైన ఆస్తుల యజమానికి ఇవ్వడం జరుగుతుందని ఎన్‌వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. భూసేకరణ చట్టానికి లోబడి నష్టపరిహారాన్ని జిల్లా కలెక్టర్ నిర్ణయం ప్రకారం చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. లక్డీకాపుల్ వద్ద ఉన్న హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. అధికారుల తరఫున మెట్రో ఎండీ ఎన్‌వీఎస్.రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు త్వరితగతిన మెట్రో పనులు చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని, దీనిలో భాగంగా తొలుత 40కి పైగా ఆస్తుల యజమానులకు ఇప్పుడు చెక్కుల పంపిణీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

కారిడార్ 6 ఇలా..

రెండో దశ మెట్రోరైలు ప్రాజెక్టులోని కారిడార్-6లో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ్‌గుట్ట వరకు 7.5 కిలోమీటర్ల వరకు మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ కారిడార్ నిర్మించడానికి రూ.2,714 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే మొదటి దశ మెట్రోరైలు ప్రాజెక్టులో జేబీఎస్-ఎంజీబీఎస్ 11 కీ.మీ కారిడార్‌లో 8 స్టేషన్లు ఉన్నాయి. నాగోల్ నుంచి ఎయిర్‌పోర్ట్ మార్గలో చాంద్రాయణ్‌గుట్ట జంక్షన్ కాబోతుంది. దీంతో పాతబస్తీ అభివృద్ధి జరుగుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాలార్‌జంగ్ మ్యూజియంకు 500 మీటర్లు, చార్మినార్‌కు 500 మీటర్ల దూరంలో మెట్రో మార్గం పోతుంది. ఏ హెరిటేజ్ నిర్మాణానికి విఘాతం కలిగించకుండా ప్రణాళిక రూపొందించారు.


Similar News